
గొర్రెల పెంపకంతో అధిక ఆదాయం
● పశుసంవర్థకశాఖ ఏడీఏ జనార్ధన్
● కేవీకేలో పెంపకందారుకు శిక్షణ
కౌడిపల్లి(నర్సాపూర్): గొర్రెలు, మేకల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చని నర్సాపూర్ పశుసంవర్థకశాఖ ఏడీఏ జనార్థన్ తెలిపారు. మంగళవారం మండలంలోని తునికి కేవీకేలో నేషనల్ మీట్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో గొర్లు, మేకల పెంపకందారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గొర్రెలు, మేకల మాంసానికి మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం సైతం పెంపకందారులకు సబ్సిడీ అందచేస్తుందన్నారు. జిల్లాలో 5లక్షల గొర్రెలు, 4.5లక్షలు మేకలు ఉన్నాయన్నారు. మేలు జాతిని పెంచడంతో ఆదాయం బాగుంటుందన్నారు. వ్యాధులు సోకితే పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యం చేస్తారని, వాక్సిన్స్ సైతం ఇస్తారని చెప్పారు. అనంతరం డాక్టర్ యేగేష్ మాట్లాడుతూ దేశంలో 77శాతం మాంసాహారులు ఉన్నారని, గొర్రెలను పెంచడంతో వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంతోపాటు వారి ఎరువుకు సైతం ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీకే హెడ్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, శాస్త్రవేత్త శ్రీకాంత్ వివిధ గ్రామాల పెంపకందారులు పాల్గొన్నారు.