
చార్మినార్ జోన్‌లో కలపండి
నర్సాపూర్: జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని జిల్లా నాయకులు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈమేరకు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి హరికృష్ణ మంగళవారం సీఎంను ఆయన నివాసంలో కలిసి వివరించారు. రాజన్న సిరిసిల్ల జోన్‌లో ఉన్నందున నిరుద్యోగులు, విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని వారు వివరించారు. ఐక్యతగా పార్టీని బలోపేతం చేసి రా బోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడంతో పాటు జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకోవాలని సూచించారని తెలిపారు.
చిలప్‌చెడ్(నర్సాపూర్): గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని డీఎల్‌పీఓ సాయిబాబా సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని అజ్జమర్రి, ఫైజాబాద్ గ్రామ పంచాయతీలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రజల నివాస పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, మురికి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, ప్రశాంతి పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్)/హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. మండలంలోని కన్నారం ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. తొమ్మిదో తరగతిలో కూర్చొని బోధనను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు చెబుతున్న పాఠాలు అర్థమవుతున్నాయా..? మీ అనుమానాలు నివృత్తి చేస్తున్నారా..? అని ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. డీఈఓ వెంట హెచ్‌ఎం శేషాద్రికుమార్, ఉపాధ్యాయులు ఉన్నారు. అనంతరం హవేళిఘణాపూర్ డైట్ కళాశాలలో ఆడ పిల్లల రక్షణ– మన అందరి బాధ్యత అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో ఆడ పిల్లల అక్రమ రవాణా అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారు భవిష్యత్‌ను మంచి బాటలో వెళ్లేలా చూడాలన్నారు.
చేగుంట(తూప్రాన్): చేగుంటతో పాటు ఇబ్రహీంపూర్ సహకార సంఘాలకు పాలకవర్గం స్థానంలో పర్సన్ ఇన్‌చార్జిలను నియమించారు. చేగుంట సహకార సంఘం పర్సన్ ఇన్‌చార్జిగా సంఘంలోని సీనియర్ డైరెక్టర్ రఘురాములు, ఇబ్రహీంపూర్‌కు సహకార సంఘం జిల్లా కార్యాలయంలోని అధికారి సాయిలును పర్సన్ ఇన్‌చార్జిగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయగా, వారు మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. కాగా చేగుంట సహకార సంఘంలోని పది మంది డైరెక్టర్లలో నలుగురిని తొలగించగా, ఇబ్రహీంపూర్ సహకార సంఘంలో చైర్మన్‌తో సహా డైరెక్టర్లందరినీ తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకుల రుణాలు, ఎరువుల అమ్మకాలు, పాలనాపరమైన ఇతర అంశాల పర్యవేక్షణ పర్సన్ ఇన్‌చార్జిల పర్యవేక్షణలోనే జరుగుతాయని చేగుంట డీసీసీబీ బ్యాంకు మేనేజర్ శశికాంత్‌రెడ్డి తెలిపారు.

చార్మినార్ జోన్‌లో కలపండి

చార్మినార్ జోన్‌లో కలపండి

చార్మినార్ జోన్‌లో కలపండి