
ఇక సౌర వెలుగులు
● పైలెట్ ప్రాజెక్టుగా పాపన్నపేట ఎంపిక!
● ప్రత్యేక కమిటీ వేసి చర్చించిన అధికారులు
సోలార్ విద్యుత్ వినియోగం పెంచడమే లక్ష్యంగా పీఎం సూర్యఘర్ పథకాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. మెతుకుసీమలో అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏడు గ్రామాలను గుర్తించిన అధికారులు ప్రత్యేక కమిటీ వేసి చర్చించారు. ఇందులో ఒక గ్రామాన్ని ఎంపిక చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. – మెదక్‌జోన్
ఈ పథకం విధివిధానాల ప్రకారం సెమీ అర్బన్ గ్రామాన్ని ఎంపిక చేయనున్నారు. ఆ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల జనాభా ఉండాలనేది ముఖ్య ఉద్దేశం. జిల్లాలో ఇలాంటివి 7 గ్రామాలను గుర్తించారు. అందులో టేక్మాల్, చేగుంట, నార్సింగి, వెల్దుర్తి, పెద్దశంకరంపేట, పాపన్న పేట గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో ఈ పథకానికి అనువైన గ్రామాన్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని వేశారు. కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, సభ్యులుగా డీపీఓ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, జెడ్పీ సీఈఓ, రెడ్‌కో డీఎం ఉన్నారు. ఈనెల 15న సమావేశమైన కమిటీ, ముందుగా ఎంపిక చేసిన 7 గ్రామాలను పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో అనువైన గ్రామంగా పాపన్నపేటను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇది ఫైనల్ అయితే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. అనంతరం నిధులు మంజూరవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలపై ఏర్పాటు
ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామానికి రూ. కోటి మంజూరు కానుంది. అనంతరం టెండర్ పిలిచి పనులను సదరు కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. వీటితో గ్రామంలోని ప్రభుత్వ భవనాలను ఎంపిక చేస్తారు. పాఠశాలలు, పంచాయతీ భవనం, అంగన్‌వాడీ, హెల్త్‌సెంటర్ భవనాలపై సోలార్ పలకలను ఏర్పాటు చేస్తారు. వీటితో పూర్తిస్థాయిలో సోలార్ పవర్ ఉత్పత్తి చేసి వినియోగిస్తారు. దీని ఆధారంగా తదుపరి జిల్లాలోని ప్రజలందరికీ సబ్సిడీపై సోలార్ పలకలను అందించనున్నారు. కాగా ఇప్పటికే పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా కిలో వాట్ విద్యుత్ నుంచి 3 కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ పలకలను సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తున్నారు. ఇందులో 3 కిలోవాట్స్ విద్యుత్ తయారు చేసే పలకలకు రూ. 2.10 లక్షల ఖర్చు అవుతుండగా, అందులో రూ. 78 వేల సబ్సిడీని కేంద్రం సదరు లబ్ధిదారుడికి అందజేస్తుంది. ఇదిలాఉండగా దేశంలో జరిగే అనేక విపత్తులకు కారణం థర్మల్ విద్యుత్ వినియోగం పెరగటమే అని నిపుణులు చెబుతున్నారు. బొగ్గును భారీగా తవ్వడంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని క్లౌడ్ బరస్ట్‌లకు కారణమవుతందని చెబుతున్నారు. అందుకే సోలార్ విద్యుత్‌ను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
ముందుగా జిల్లాను
ఎంచుకున్నాం
పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ముందుగా మెదక్‌ను ఎంచుకున్నాం. జిల్లాలో ఏడు గ్రామాలను గుర్తించాం. కమిటీలో చర్చించి అన్నివిధాలుగా అనువైనదిగా పాపన్నపేటను ఎంపిక చేశాం. కమిటీ చైర్మన్ కలెక్టర్ ఫైనల్ చేయాల్సి ఉంది.
– రవీందర్ చౌహాన్, రెడ్‌కో డీఎం

ఇక సౌర వెలుగులు