
మెరుగైన వైద్యం అందించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
నర్సాపూర్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ వైద్యులకు సూచించారు. మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులను కలిసి వైద్య సేవలు, వసతులపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంపై దృష్టి పెట్టిందన్నారు. రోగులకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించాలన్నారు. కాగా రోగులకు అందిస్తున్న సేవలపై ఆస్పత్రి సూపరింటెండెంట్ పావని కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇసుక బజారును, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వైకుంఠధామాన్ని పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలకు నాణ్యమైన ఇసుక అందచేయాలన్న ఉద్దేశంతో ఇసుక బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వైకుంఠధామంలో వసతుల గురించి కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు.