
అతివలకు ఆరోగ్య భరోసా
● నేటి నుంచి స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్
● జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మెగా హెల్త్ క్యాంపు
మెదక్ కలెక్టరేట్: మహిళలు, పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో మెగా హెల్త్ క్యాంపు ద్వారా ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు 5 చొప్పున మొత్తం 65 శిబిరాలు నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలోని అన్ని అంగన్‌వాడీలలో పోషణ్ మాహ్ వేడుకలతో పాటు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించనున్నారు.
అందించే సేవలు ఇవే..
అధిక రక్తపోటు, మధుమేహం, రక్తహీనత, టీబీ, నోటి, రొమ్ము, గర్భాశయ కేన్సర్ వంటి వాటిని గుర్తిస్తారు. గిరిజన ప్రాంతాల్లో తలసేమియా పరీక్ష నిర్వహిస్తారు. ప్రత్యేకంగా గైనే, కన్ను, చెవి, ముక్కు, చర్మం, మానసిక ఆరోగ్యం, దంతవైద్యం వంటి పరీక్షలు చేస్తారు. తల్లి, పిల్లల సంరక్షణ కోసం తనిఖీలు చేపట్టి అవసరమైన వారికి ఎంసీపీ కార్డులు పంపిణీ చేస్తారు. మహిళల కోసం ఋతు పరిశుభ్రత, కౌమారదశ– తల్లి పోషణ, వంట నూనె వినియోగం, న్యూట్రిషన్ కౌన్సెలింగ్, కమ్యూనిటీ స్థాయిలో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. టీబీ రోగులను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టనున్నారు. అలాగే అక్టోబర్ 1వ తేదీన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఇందులో ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లను భాగస్వామ్యం చేయనున్నారు.