
తాగు నీటి ఎద్దడి రాకుండా చూడండి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, కొల్చారం, హత్నూర మండలాల్లోని పలు గ్రామాలకు నీటి సరఫరా సరిగా కావడం లేదని, ప్రజలకు నల్లాల ద్వారా సరిపడా నీటి సరఫరా జరిగే విధంగా చూడాలని సూచించారు. అవసరమైన చోట పైపులైన్ ఏర్పాటు చేయాలని, లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మేజర్ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ రఘువీర్, డీఈఈలు ప్రవీన్‌కుమార్, శ్రీనివాస్‌తో పాటు పలువురు ఏఈలు, నర్సాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.