
సవాలక్ష ఆంక్షలు
ప్రస్తుతం పాత దరఖాస్తులకే మోక్షం
● కొత్త వాటిపై స్పష్టత కరువు
● జిల్లాలో 6,500 మంది రైతులకు మేలు
జిల్లాలో 2014 కంటే ముందు సాదాబైనామా ద్వారా వేలాది మంది సన్న, చిన్నకారు రైతులు భూముల క్రయవిక్రయాలు చేసుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూశాఖ ప్రక్షాళన పేరుతో నూతనంగా ధరణి చట్టాన్ని తెచ్చింది. సాదాబైనామాలో భూముల క్రయవిక్రయాలు చేసుకున్న రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈమేరకు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు గడువు ఇచ్చింది. దీంతో జిల్లావ్యాప్తంగా 6,500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ప్రస్తుతం పట్టాలు అయ్యే అవకాశం ఉంది.
కొత్త వారికి ఎప్పుడో..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా సాదాబైనామాలతో క్రయవిక్రయాలు జరిపిన రైతులకు పట్టాలు చేస్తామని చెప్పింది. ఈమేరకు ఈ ఏడాది జూన్ 2 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 8 వేల మంది రైతులు వినతులు సమర్పించారు. కాగా వీటిని ఎప్పుడు పరిష్కరిస్తామనేది ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. అంతేకాకుండా ఐదెకరాలలోపు సాదా బైనామాలపై క్రయవిక్రయాలు జరిపిన రైతులకు మాత్రమే పట్టాలు చేస్తామని, పాత దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి సవాలక్ష ఆంక్షలు విధించింది.
క్షేత్రస్థాయిలోకి సర్వేయర్లు
పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేయర్లు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో 219 మంది దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతలో 116 మందిని ఎంపిక చేసింది. వారికి 50 రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. రెండవ బ్యాచ్‌లో మరో 103 మంది సర్వేయర్లకు గత నెల 18 నుంచి శిక్షణ ఇస్తున్నారు.
తెల్ల కాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల (సాదా బైనామాల) క్రమబద్ధీకరణకు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారు. భూ భారతి చట్టం ప్రకారం పట్టాలు చేసుకునే వెసులుబాటు ఉందని గతనెల హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే పాత దరఖాస్తులను మాత్రమే ముందుగా పరిగణలోకి తీసుకొని పట్టాలు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చాయి. కాగా ఈ ఏడాది జూన్‌లో కొత్తగా స్వీకరించిన దరఖాస్తులను ఎప్పుడు పరిష్కరిస్తారనేది స్పష్టత కరువైంది.
– మెదక్‌జోన్
పాత దరఖాస్తులకే పట్టాలు
2014 జూన్ 2 కంటే ముందు 5 ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులు సా దా బైనామాలపై భూముల క్రయవిక్రయాలు చేసుకున్న వారు, 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి భూములకు మాత్రమే పట్టాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
– నగేశ్, అదనపు కలెక్టర్

సవాలక్ష ఆంక్షలు