
పీఎం కిసాన్.. కొందరికే సాయం
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం జిల్లాలో కొంతమంది రైతులకే అందుతోంది. చాలా మంది రైతులకు సాయం అందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నవారినే అర్హులుగా గుర్తించి సాయం అందిస్తున్నారు. వారికి ఏటా పెట్టుబడి సాయంగా మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున రూ. 6 వేలు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆ తర్వాత పట్టాదారు పుస్తకాలు పొందిన వారికి ఈ పథకంలో నమోదుకు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది పీఎం కిసాన్ పథకానికి దూరం అవుతున్నారు. జిల్లాలో సాధారణ పట్టాలు కలిగిన రైతులు 1,64,151 ఉన్నారు. ఇందులో కొత్త పట్టాదార్ పుస్తకాలు 12 వేలు ఉన్నాయి. పీఎం కిసాన్ డబ్బులు వచ్చిన రైతులు ఎవరైనా చనిపోతే వారి ద్వారా వారసత్వపు పాస్‌బుక్‌లు పొందిన వారికి మాత్రమే పథకంలో చేరే అవకాశం కల్పిస్తున్నారు.
ఆరేళ్లుగా అవకాశం లేదు..
ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంలో చేరేందుకు రైతులకు అవకాశం కల్పించడం లేదు. ఆరేళ్ల క్రితం పీఎం కిసాన్ పథకంలో 1,22,347 మంది రైతులు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు కొంతమంది తమ పొలాలు అమ్ముకోగా, ఇంకొంత మంది రైతులు చనిపోగా, మరికొంతమంది కుమారులకు గిఫ్ట్‌డీడ్ చేశారు. జిల్లాలో సుమారు 6 వేల వరకు రైతులు పీఎం కిసాన్‌లో తగ్గిపోయినట్లు సమాచారం. ఈ ఏడాది పీఎం కిసాన్‌తో సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు మేలో రైతులకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ విధానాన్ని కేంద్రం చేపట్టింది. కానీ కొత్తగా వ్యవసాయ పొలాలు కొనుగోలు చేసి పట్టాదార్ పాస్‌పుస్తకాలు పొందిన వారికి పీఎం కిసాన్ పథకంలో లబ్ధి పొందే అవకాశం లేకుండా పోయింది. దీంతో సుమారు 40 వేల మంది అర్హులైన రైతులు పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు.