
జీపీఓలు వచ్చేశారు..
● ఇక గ్రామ లెక్కలు సరి చూస్తారు
● జిల్లాకు 91 మంది కేటాయింపు
● విధుల్లో చేరిన 76 మంది అధికారులు
మెదక్ అర్బన్: గ్రామ పాలనాధికారులు వచ్చేశారు. జిల్లాకు 91 మందిని కేటాయించగా, శుక్రవారం నాటికి 76 మంది విధుల్లో చేరారు. మిగితా వారు సోమవారం వరకు రిపోర్టు చేసే అవకాశం ఉంది. దీంతో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు లేని లోటు తీరనుంది. ఇక నుంచి గ్రామాల్లో భూముల నిర్వహణ, ప్రభుత్వ, ప్రైవేట్, శిఖం భూములు, చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌ల పరిరక్షణతో పాటు ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపికలో వీరు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. భూభారతి చట్టంలో భాగంగా ప్రతి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు విలేజ్ మ్యాప్ జోడించడంలో కూడా సహాయకారిగా పనిచేస్తారు.
వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ
రాష్ట్రంలో ఉన్న వీఆర్వో వ్యవస్థను 2020లో రద్దు చేసి వారిని ఇతరశాఖలకు బదిలీ చేశారు. వీఆర్‌ఏలు మాత్రం రెండేళ్లు ఊరు, మండల రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించారు. అనంతరం 2023లో వారి అర్హతను బట్టి ఇతర రెవెన్యూ శాఖలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. భూముల రికార్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించి సమాచారం ఇచ్చే వారు కరువయ్యారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం వీఆర్‌ఓ వ్యవస్థను పునరుద్ధరించింది. వీరికి గ్రామ పాలనాధికారుల (జీపీఓ) పేరుతో ఇతర డిపార్ట్‌మెంట్లలో ఉన్న వారిని ఎంపిక చేసి, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో నియామకపత్రాలు అందజేసింది.