
వరద ముప్పు.. ఎవరిదీ తప్పు!
డ్రైనేజీ నిర్మాణంలో ముందుచూపు కరువు
చినుకు పడితే చాలు.. పట్టణ ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు చెరువులను తలపిస్తుండగా, ఇళ్లు, షాపులు జలమయం అవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పూర్తిస్థాయిలో మురికి నీరు బయటకు వెళ్లే మార్గం కరువైంది. దీనికి తోడు అధికారుల
సమన్వయ లోపం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. వెరసి కొద్దిపాటి వర్షం కురిసినా లోతట్టు
ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు
కరువవుతోంది.
– మెదక్‌జోన్
మెదక్‌లో 32 వార్డులు ఉండగా, అనేక వార్డుల్లో డ్రైనేజీ సమస్య వేధిస్తోంది. ప్రధానంగా రాందాస్ చౌరస్తా, గాంధీనగర్, ఆటోనగర్, శాంతినగర్, వెంకట్రావునగర్, అంబేడ్కర్ కాలనీ, కోర్టు రోడ్డు, బాలుర జూనియర్ కాలేజీ, ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంతం.. వర్షం పడితే జలమయం అవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపైకి చేరుతోంది. పట్టణ ప్రధాన రహదారి పొడవు సుమారు 3 కిలోమీటర్లకు పైగా ఉండగా, ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన మురికి కాలువలు చాలా చోట్ల అసంపూర్తిగా, అధ్వానంగా మారాయి. ముఖ్యంగా మురికి కాలువలకు ఔట్‌లెట్ లేకుండానే అర్ధంతరంగా వదిలేయడంతో వర్షంతో కాలువలు నిండి నీరు రోడ్లపైకి ప్రవహిస్తోంది. మరికొన్ని చోట్ల డ్రైనేజీలు చిన్నగా ఉండటంతో వరదనీరు ఎక్కువై రోడ్లపైకి చేరుతోంది. పట్టణంలోని సాయిదత్త సినిమా థియేటర్ వద్ద ఔట్ లెట్ లేకుండానే మురికి కాలువును నిర్మించి వదిలేశారు. అలాగే గాంధీనగర్‌లో సైతం డ్రైనేజీకి నిర్మాణానికి అడ్డంగా పలు ఇళ్లు రాగా అర్ధంతరంగా వదిలేశారు. పెద్దబజార్, జేఎన్ రోడ్డు నుంచి వర్షం నీరు సరాసరి రాందాస్ చౌరస్తాకు వస్తోంది. అక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు మీటర్‌పైకి చేరి పలు షాపుల్లోకి చేరుతోంది. మధ్యలో డివైడర్ నిర్మించడంతో సమస్య మరింత ఉత్పన్నం అవుతోంది. గతంలో నీరు కింది భాగంలో గల అజంపుర వైపు వెళ్లేది. డివైడర్ అడ్డుగా ఉండటం, మురికి కాలువలు చిన్నగా ఉండటంతో రాందాస్ చౌరస్తా చెరువును తలపిస్తోంది.
మురికి కాలువల నిర్మాణాలకు అడ్డుగా ఇళ్లు
పట్టణంలో అనేక చోట్ల డ్రైనేజీ నిర్మాణానికి ఇళ్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో అధికారులు వాటిని కూల్చకుండా కాలువల నిర్మాణాలను అక్కడికే వదిలేశారు. దీంతో వర్షం నీరు వెళ్లే మార్గం లేక పట్టణం అస్తవ్యస్తంగా మారుతోంది. రాజధానికే పరిమితమైన హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాలో ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మెదక్ పట్టణంలో వరద ప్రహహం
జలమయం అవుతున్న రోడ్లు
ఇళ్లు, షాపుల్లోకి చేరుతున్న నీరు
మెదక్ పట్టణంలో దుస్థితి