
ముమ్మాటికీ కక్షసాధింపే
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు బనాయించడమేకాకుండా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వంపై వివిధ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, అక్రమాలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మీడియా కర్తవ్యమని అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఏపీ ప్రభుత్వం తక్షణం మానుకోవాలని వారు హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ నిర్బంధ చర్యలపై పలువురి నేతల అభిప్రాయాలు.. వారి మాటల్లోనే..
తప్పుడు కేసులు సరికాదు
ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడులు సరికాదు. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయటం, వార్తలు రాస్తే ఎడిటర్ నుంచి మొదలుకొని విలేకరులపై తప్పుడు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం సహించరాని నేరం.
– కిరణ్‌గౌడ్, అడ్వకేట్
మీడియా జోలికొస్తే ఖబడ్దార్
ప్రజాస్వామ్యంలో పత్రికలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయి. ప్రజల సమస్యలను వెలికితీసి వాస్తవాలను ప్రజలకు చేరవేస్తాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. నిజాలను నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం అత్యంత హేయమైన చర్య.
– సురేందర్‌రెడ్డి,
టీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్
అధికారం శాశ్వతం కాదు
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. దానిని అడ్డుపెట్టుకొని పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులు వెంటనే ఆపడంతో పాటు విలేకరులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.
– నరేందర్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు
దుర్మార్గమైన వైఖరి
ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న సాక్షిపై తప్పుడు కేసులు బనాయించడం దారుణం. ప్రజా ఉద్యమాలకు మొదటి నుంచి ఊపిరిపోస్తున్న సాక్షిపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దుర్మార్గమైన వైఖరిని మాలమహానాడు తీవ్రంగా ఖండిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
– ర్యాకం శ్రీరాములు, జాతీయ మాలమహానాడు
రాష్ట్ర పొలిట్‌బ్యూరో చైర్మన్
పత్రికా స్వేచ్ఛను హరించడమే
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు మూల స్తంభం లాంటివి. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయటం, రిపోర్టర్లపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదు.
– రోహిత్‌రావు, మెదక్ ఎమ్మెల్యే
హేయమైన చర్య
నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల పాత్ర విస్మరించలేనిది. చంద్రబాబు సర్కార్ భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం హేయమైన చర్య. పత్రికల్లో పబ్లిష్ అయిన వార్తలు నచ్చకుంటే ఖండించుకోవాలే తప్ప, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం తగదు. ప్రజాస్వామ్యానికి పత్రికలే ప్రాణవాయువు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన తప్పుడు కేసులు నిలబడేవికావు.
– అమ్మన రాంచంద్రారెడ్డి,
సీనియర్ న్యాయవాది
దేశంలోనే పెద్ద నియంత చంద్రబాబు
దేశంలోనే పెద్ద నియంత చంద్రబాబు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కక్షసాధించడం తగదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను దళిత, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
– కేఆర్ భీమసేన,
భీమ్ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు