
ఉత్తమ ఫలితాలు సాధించాలి
శివ్వంపేట(నర్సాపూర్): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి మాధవి అన్నారు. శుక్రవారం శివ్వంపేట జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులకు అందుతున్న బోధన, తదితర సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులు కాలేజీకి వచ్చే విధంగా చూ డాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. చదువులో వెనుకబడిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆమె వెంట ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నాగమణి, సిబ్బంది ఉన్నారు.
భూ భారతి దరఖాస్తులు
పరిష్కరించాలి
నర్సాపూర్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. విధుల పట్ల సిబ్బంది అంకితభావంతో పని చేయాలన్నారు. అధిక వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా భూ భారతి దరఖాస్తుల పరిష్కారం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఆర్డీఓ అదనపు కలెక్టర్‌కు వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ ఫైజల్ తదితరులు ఉన్నారు.
వర్షంతో నిలిచిన పనులు
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ వద్ద కొట్టుకుపోయిన రైల్వేలైన్ బ్రిడ్జి మరమ్మతు పనులకు వర్షం అడ్డంకిగా మారింది. గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు రైల్వేలైన్ కట్ట కొట్టుకుపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న వదరతో కొంత ఆలస్యంగా పనులు చేపట్టారు. మట్టి సంచులను అడ్డుగా వేసినప్పటికీ గురువారం మళ్లీ వర్షం పడడంతో వరద వచ్చి పనులు కొనసాగలేదని రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు 15 రోజుల పాటు పనులు కొనసాగే అవకాశం ఉందన్నారు.
నానో యూరియాతో
మంచి దిగుబడి
డీఏఓ దేవ్‌కుమార్
నర్సాపూర్ రూరల్: నానో యూరియాతో మంచి దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అవంచలో ఓ రైతు సాగు చేస్తున్న 13 ఎకరాల వరిలో నానో యూరియా పిచికారీతో ఎదుగుతున్న పంటను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నానో యూరియాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. రైతులు పంట మార్పిడి తప్పక అలవర్చుకొని అమలు చేయాలని తెలిపారు. భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాలకు అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలన్నారు. అనంతరం అవంచ రైతు వేదికలో యూరియా పంపిణీని పరిశీలించారు. ప్రతి రైతుకు యూరియా అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రొఫెసర్ లక్ష్మణ్, మండల వ్యవసాయ అధికారి దీపిక, సిబ్బంది ఉన్నారు.
రాష్ట్రస్థాయికి
11 మంది విద్యార్థులు
మెదక్ కలెక్టరేట్: ఇటీవల మెదక్‌లో నిర్వహించిన కళా ఉత్సవ్ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 11 మంది రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీఈఓ రాధాకిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ చూపాలని సూచించారు.