
పత్రికా స్వేచ్ఛపై దాడే..
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా కలంపై కత్తి కట్టడాన్ని పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. పత్రికాస్వేచ్ఛకు విఘాతం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పలువురి నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
పత్రికా స్వేచ్ఛను హరించడమే
మెదక్‌జోన్: పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల స్వేచ్ఛను హరించడమే. పత్రికలు ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటాయి. వాస్తవాలు రాస్తే దాడులు చేయటం మంచి సాంప్రదాయం కాదు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం.
– పద్మారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాల
ఎడిటర్‌పై కేసులు దారుణం
నర్సాపూర్: సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డిపై కేసులు పెట్టడం దారుణం. జర్నలిస్టులు పార్టీలకతీతంగా పని చేస్తారు. వారికి తగిన స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజల సమస్యలు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఎత్తి చూపగలుగుతారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఎడిటర్‌పై కేసులు పెట్టడం సరికాదు.
– ఆంజనేయులుగౌడ్, డీసీసీ అధ్యక్షుడు ు
నియంతృత్వ పాలన సాగిస్తోంది
పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఏపీలోని కూటమి సర్కారు నియంతృత్వ పాలన సాగిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. తమను విమర్శించే వార్తలు ప్రచురితమైతే వివరణ ఇవ్వాలే కానీ, పాలకుల ప్రోద్బలంతో పత్రికలపై పోలీసులు కేసులు పెట్టడం సరికాదు. ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.
– మల్లేశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
హేయమైన చర్య
చిన్నశంకరంపేట(మెదక్): పత్రికా స్వేచ్ఛను హరించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. ప్రజా సమస్యలపై, ప్రజల హక్కులపై ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలకు పాల్పడడం దారుణం. పత్రికల్లో వచ్చే కథనాలతో పనితీరును మార్చుకోవాల్సింది పోయి, విలేకరులను కేసుల పేరుతో వేధించడం హేయమైన చర్య.
– పోచయ్య, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ముక్తకంఠంతో ఖండించాలి
మెదక్‌జోన్: ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తూ ఎడిటర్ నుంచి మొదలుకొని జర్నలిస్టులపై కేసు లు పెట్టడం అన్యాయం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. దీనిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది.
– శంకర్‌దయాళ్‌చారి,
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు
తప్పుడు కేసులు సరికాదు
నర్సాపూర్: జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం సరికాదు. ప్రతిపక్ష నాయకులు ప్రెస్‌మీట్‌లో అధికార పక్షంపై ఆరోపణలు చేసినప్పుడు వాటిని జర్నలిస్టులు రాయాల్సి ఉంటుంది. అంతమాత్రానా విలేకరులను బాధ్యులను చేయడం సరికాదు. నిజాలను నిర్భయంగా రాసే వాతావరణం ఉన్నప్పుడే పత్రికా స్వేచ్ఛ ఉంటుంది.
– సునీతారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
కక్ష సాధింపు సిగ్గుచేటు
దుబ్బాక: ఏపీలో నిజాలను నిర్భయంగా రాస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలకు మద్దతుగా కథనాలు రాస్తున్న సాక్షిపై అక్రమ కేసులు బనాయిస్తూ, కార్యాలయాలపై దాడులకు పాల్పడటం పత్రిక స్వేచ్ఛను హరించడమే. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటు. దాడులు, అక్రమ కేసులను ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించడంతో పాటుగా సాక్షికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే