
సమగ్ర వివరాలు అందించండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్/కొల్చారం(నర్సాపూర్): జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల నివేదిక తయారు చేసి వెంటనే అందజేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా వారికి దిశానిర్దేశం చేశారు. వర్షాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని మరమ్మతులకు అవసరమైన వాటిని వెంటనే గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో నివేదికలు తయారు చేసేటప్పుడు పారదర్శకత పాటించాలన్నారు. అలాగే పాఠశాలలకు వసతి గృహాలకు అవసరమైన మౌలిక వసతులపై ఆరా తీశారు. కార్యక్రమంలో అన్ని సంక్షేమశాఖల ఉన్నతాధికారులు ఇరిగేషన్ పంచాయతీరాజ్, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కొల్చారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గడువు తీరిన మందులను వెంటనే తొలగించాలన్నారు. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూ రికార్డులకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు.
వారిని సస్పెండ్ చేయండి
డీఎంహెచ్‌ఓకు కలెక్టర్ ఆదేశం
కొల్చారం(నర్సాపూర్): కొల్చారం ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో కిందిస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది విధులకు తరచూ గైర్హాజరవుతున్నారని, వారిని వెంటనే తొలగించాలని డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌ను కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. గురువారం ఆస్పత్రిని తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. ఆ సమయంలో కిందిస్థాయి సిబ్బంది విధులకు హాజరవుతున్నట్లు గుర్తించారు. సంతకాలు పెట్టి డ్యూటీ చేయడం లేదంటూ కలెక్టర్ విచారణలో తేలింది. దీంతో సదరు సిబ్బందిపై విచారణ జరిపి విధుల నుంచి తక్షణ మే తొలగించాలని ఆదేశించారు.