
జీఎస్టీ తగ్గింపుతో మేలు
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
మెదక్‌జోన్/పాపన్నపేట: జీఎస్టీ తగ్గింపుతో కోట్లాది భారతీయులకు మేలు జరుగుతుందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వాణిజ్య, వ్యాపారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతీ నెల రూ. 3,700 కోట్ల నష్టం వచ్చినా, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరగాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. స్వదేశి వస్తువులను విక్రయించి దేశ ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, నేతలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లిలో జరిగిన సేవా పక్షం కార్యక్రమానికి ఎంపీ హాజరై మాట్లాడారు. మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ పేరుతో కొందరు ఇళ్లంతా బంగారం నింపుకొని, ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.