
రామాయంపేట పట్టణంలో రోడ్డు పక్కనే చెత్త కుప్పలు
మొక్కుబడిగా 100 రోజుల యాక్షన్ ప్లాన్
మున్సిపాలిటీల్లో మెరుగుపడని పారిశుద్ధ్యం
ఆశించిన స్థాయిలో కనిపించని మార్పు
‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూసిన వాస్తవాలు కలెక్టర్ రాహుల్‌రాజ్
‘ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు’ అనే నినాదంతో మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళిక మొక్కుబడిగా సాగింది. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు రోజుకో కార్యక్రమం చేపట్టాల్సి ఉన్నా.. మొదట్లో హడావుడి చేసినా అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం మరిచారు. దీంతో ‘చెత్త కదలక.. మురుగు పారక’ బల్దియాలు అధ్వానంగా మారాయి. అంతర్గత రోడ్లకు మరమ్మతులు కరువయ్యాయి. బుధవారం ‘సాక్షి’ పరిశీలనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
నిధులు రాక.. పనులు చేపట్టక
నర్సాపూర్: ప్రత్యేక నిధులు రాకపోవడంతో మున్సిపాలిటీలో శాశ్వత పనులు చేపట్టలేదు. మురికి కాలువలను శుభ్రం చేశారే తప్ప, ఎక్కడా కొత్తవి నిర్మించలేదు. తాగు నీటి సరఫరా, చెత్త సేకరణ, దోమల నివారణకు ఫాగింగ్ తదితర పనులు కొంతమేర చేపట్టారు. రెండో వార్డులోని కొన్ని ఏరియాల్లో మురికి కాలువలు లేకపోవడంతో నీరు రాయరావు చెరువులోకి, పదో వార్డులో కొంత ఏరియా నుంచి కోమటికుంటలోకి చేరుతోంది. మురికి కాలువలకు ఇరువైపులా పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడం, కాలువల్లో చెత్త నిండి దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
రోడ్లపైనే మురుగు..
తూప్రాన్: పట్టణంలో ఎక్కడా అశించినస్థాయిలో మార్పు కనిపించడం లేదు. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. చెత్త సేకరణకు ఆటోలు వచ్చినా, కొందరు వేయడం లేదు. వర్షం నీరు, మురుగు నీరు రోడ్లపై పారుతూనే ఉంది. పట్టణంలోని ఆరోవార్డు అంగన్‌వాడీ కేంద్రం వద్ద రోడ్డుపై మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అయి నీరు వృథాగా రోడ్డుపై పారుతోంది. వంద రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య పనులు ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
ప్రజల్లో మార్పు రావడం లేదు
మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం పక్కాగా నిర్వహించాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక నిధులు మంజూరు కాలేదు. మున్సిపల్ సిబ్బందితోనే పనులు చేపట్టాం. నిత్యం తడి, పొడి చెత్త వేరు విధానంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాం. కాని వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. – గణేశ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
శాశ్వత పనులు చేపట్టలేదు
వంద రోజుల ప్రణాళికలో ప్రభుత్వం సూచించిన అన్ని కార్యక్రమాలు చేపట్టాం. ప్రత్యేక నిధులు రాకపోవడంతో ఎలాంటి శాశ్వత పనులు చేపట్టలేదు. వర్షాలు బాగా కురిసినందున దోమలు వ్యాప్తి చెందకుండా అంతటా ఫాగింగ్ చేపట్టాం. – శ్రీరాంచరణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మెరుగైన వైద్యం అందించాలి
ఫొటోలకే పరిమితం
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రణాళిక తూతూమంత్రంగానే కొనసాగింది. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసినా, పనులు మాత్రం సరిగా కొనసాగలేదు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది కేవలం ఫొటోలకే పరిమితమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. మౌలిక సదుపాయాల కల్పన విషయమై ఎంతమాత్రం పట్టించుకోలేదు. పచ్చదనం విషయంలో పట్టనట్లు వ్యవహరించారు. తడి, పొడి చెత్తను వేరు చేయటం లేదు. మురుగు నీటిని మల్లె చెరువులోకి మళ్లించడంతో దుర్వాసన వెదజల్లుతోంది. నల్లా కనెక్షన్ల ఆన్‌లైన్ చేయలేదు. వీధి విక్రయదారుల సంఘాల ఏర్పాటు కాలేదు. కొత్తగా మహిళా సంఘాల ఏర్పాటు చేపట్టలేదు.
అంశాల వారీగా నిర్వహించాం
మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రణాళిక నిబంధనల మేరకు సాఫీగా నిర్వహించాం. ఈమేరకు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్యం విషయమై ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. జీఓలో పేర్కొన్న విధంగా అంశాల వారీగా పనులు నిర్వహించాం – దేవేందర్, మున్సిపల్ కమిషనర్
అంతంతమాత్రమే..
మెదక్ మున్సిపాలిటీ: మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక పనులు అంతంత మాత్రమే జరిగాయి. వార్డుల్లో అధికారులు నామమాత్రపు పర్యటనలతోనే సరిపెట్టారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండగా, దోమల నివారణను అరికట్టడంలో విఫలమయ్యా రు. వార్డుల్లో తడి, పొడి చెత్తపై ర్యాలీలు నిర్వహించిన అధికారులు, అమలుపర్చడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
సక్రమంగా చేపట్టాం
వంద రోజుల ప్రణాళికలో భువన్ సర్వే, ట్రెడ్ లైసెన్స్‌లు అమలు సక్రమంగా నిర్వహించాం. తడి, పొడి చెత్త సేకరణ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాం. – శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్