
ఆడబిడ్డలకు సర్కారు కానుక
● ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులకు బతుకమ్మ చీరలు ● ఈనెల 15 వరకు వచ్చే అవకాశం ● జిల్లాలో 1.58 లక్షల మంది సభ్యులు
రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా ఆడబిడ్డలు జరుపుకొనే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం కానుక సిద్ధం చేస్తుంది. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ‘రేవంతన్న కానుక’ పేరుతో స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు మాత్రమే అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.
మెదక్‌జోన్: జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామాల్లో 13,257 ఎస్‌హెచ్‌జీ గ్రూపులు ఉండగా, 1,37,239 మంది సభ్యులు, అలాగే నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 2 వేల గ్రూపులు, 21 వేల మంది సభ్యులు ఉన్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా మొత్తం 15,257 ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు గాను 1,58,239 మంది సభ్యులు ఉన్నారు. కాగా ఈనెల 21 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రూపు సభ్యులందరకీ ‘రేవంతన్న కానుక’ పేరుతో బతుకమ్మ చీరలను పంపిణీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా జిల్లాకు ఈనెల 15 వరకు చేరనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
60 శాతం మహిళలకే..
జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన మహిళలు మొత్తం 2,71,787 మంది ఉన్నారు. వీరిలో ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో ఉన్నది మాత్రం 1,58,239 మంది మాత్రమే. కాగా వీరికి మాత్రమే చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 1,13,548 మంది మహిళలకు నిరాశే మిగిలే . అవకాశం ఉంది. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను 18 ఏళ్లు పైబడిన మహిళలందరకీ రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసింది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో చీరలను పంపిణీ చేయలేదు. ఈసారి ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేయనుంది.
నాలుగు గోదాంల గుర్తింపు
మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కోసం జిల్లాలో మెదక్, చేగుంట, అల్లాదుర్గం, నర్సాపూర్‌లో గోదాంలను గుర్తించారు. వాటిలో డంప్ చేసి అక్కడి నుంచి వివిధ గ్రామాలకు పంపించనున్నారు. గ్రామైఖ్య సంఘాల ద్వారా పల్లెల్లో, మెప్మా ద్వారా మున్సిపాలిటీల్లో సభ్యులకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జాబితా పంపించాం
బతుకమ్మ చీరల పంపిణీ కోసం ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యుల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. చీరలు రాగానే అధికారుల ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం.
– శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీఓ

ఆడబిడ్డలకు సర్కారు కానుక