
అన్నదాతకు ఊరట..!
జిల్లావ్యాప్తంగా 21 మండలాలు గుర్తింపు
ఒక్కో రైతుకు రెండెకరాల వరకు వర్తింపు
గ్రామసభ తీర్మానం మేరకు పనులు
హవేళిఘణాపూర్(మెదక్): వరదలతో పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించే పనులు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో దాదాపు 2,294 మంది రైతుల పంట పొలాల్లో 1,060 ఎకరాల వరకు పంట పొలాల్లో ఇసుక మేటలు పెట్టినట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా 9 మండలాల్లో తీవ్రత ఉందన్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసి పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ మేరకు గ్రామ సభలో తీర్మానం చేసిన పనులను వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. అత్యధికంగా పంటలు దెబ్బతిన్న వాటిలో హవేళిఘణాపూర్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, నిజాంపేట, కొల్చారం, వెల్దుర్తి, తూప్రాన్, శివ్వంపేట మండలాలు ఉన్నాయి. ఒక్కో రైతుకు చెందిన రెండెకరాల చొప్పున పొలాల్లో ఇసుక మేటలు తీసేందుకు వీలు కల్పించారు. ఈ పనులు చేసేందుకు గాను రైతు ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాబ్‌కార్డు కలిగి ఉండాలి. గ్రామసభ తీర్మానం మేరకు ఉపాధి హామీ కూలీలతో పనులు చేయాలని నిర్ణయించారు. రైతు పొలంలో ఎకరాకు 600 క్యూబిక్ మీ టర్ల చొప్పున తీసి 10 మీటర్ల దూరంలో పోయనున్నారు. దీంతో ఇటీవల వరదలతో సాగుకు ఇబ్బందికరంగా ఉన్న రైతులకు ఈ పనుల ద్వారా లబ్ధి చేకూరునుంది.
రైతులు నష్టపోయారు
కౌడిపల్లి(నర్సాపూర్): పంట పొలాల్లో ఏర్పడ్డ ఇసుక మేటలను ఉపాధి కూలీల చేత తొలగించుకునే అవకాశం వచ్చిందని డీఆర్‌డీఓ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో ఉపాధి హామీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఇతర రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలతో పంటపొలాల్లో ఇసుక మేటలు ఏర్పడి రైతులకు నష్టం కలిగిందన్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందన్నారు. వన మహోత్సవంలొ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ పుణ్యదాస్, ఈసీ ప్రేంకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఉపాధి’తో ఇసుక మేటలకు మోక్షం