
తడి లేక వాడిపోతున్న వరి
ప్రమాదంలో 2,500 ఎకరాలు ఆయకట్టు రైతుల్లో ఆందోళన
గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు రాయినిపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రెండు కాల్వలు తెగిపోయాయి. దీంతో 2,500 ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడింది. 10 రోజులుగా నీటి తడులు లేక పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. తెగిన కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఆ దిశగా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో సాగు నీరు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
– మెదక్‌జోన్
నిజాం పాలనలో మెదక్ మండల పరిధిలోని రాయినిపల్లి శివారులో ప్రాజెక్టును నిర్మించారు. దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 232 ఎంసీఎఫ్‌టీ. దీని పరిధిలో రాయినిపల్లి, తిమ్మనగర్, పాతూర్, మక్తభూపతీపూర్, గుట్టకిందిపల్లి, వెంకటాపూర్, కోంటూర్ గ్రామాల పరిధిలోని సుమారు 2,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అదనంగా మరో 500 ఎకరాలకుపైగా ఉంది. కాగా రెండు కాలువల ద్వారా ఆయకట్టుకు సాగు నీటిని అందిస్తోంది. ఇందులో పైభా గంలో గల కాలువ మూడు కిలోమీటర్ల పొడవు ఉండగా, కింది భాగంలో నిర్మించినది రెండున్నర కిలో మీటర్లకుపైగా ఉంటుంది. గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు పొంగి పొర్లగా, సాగునీరు అందించే రెండు కాలువలు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రాజెక్టు కట్టిన సమయంలో వీటిని నిర్మించగా, ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని, భారీ వరదలకు తెగిపోయాయని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కొందరు రైతులు వాగులో మోటార్లు ఏర్పాటు చేసి పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎండిపోతున్న పొలాలు
పంటలకు సాగునీరు అందించే కాలువలు ధ్వంసం కావడంతో ప్రాజెక్టు నిండా నీరు ఉన్నప్పటికీ, పది రోజులుగా నీటి తడులు అందించలేని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా వరి పొలాలు ఎండు ముఖం పడుతున్నాయి. మరో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటే ఆశలు వదులుకోవాల్సిందేనని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
శాశ్వత మరమ్మతులకు
రూ. కోటి అవసరం
భారీ వర్షాలతో తెగిపోయిన రాయినిపల్లి ప్రాజెక్టు ఆనకట్ట కాలువల శాశ్వత మరమ్మతులకు రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే కాలువలకు ఎప్పుడు మరమ్మతులు చేస్తారు..?సాగునీరు ఎప్పుడు అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
భారీ వర్షాలకు తెగిన రాయినిపల్లి ప్రాజెక్టు కాల్వలు

తడి లేక వాడిపోతున్న వరి