
గండ్లు పూడ్చరేం?
సింగూరు ఆయకట్టు రైతుల సాగు ఇక్కట్లు
పుల్‌కల్(అందోల్): ఇటీవల భారీ వర్షాల కారణంగా తెగిపడ్డ పంటకాలువలు, యూరియా కొరతతో రైతులు కష్టాలనెదుర్కొంటున్నారు. ఈ కష్టాలకు తోడు ఈ ఏడు వానాకాలం నుంచి సింగూరు సాగునీరు వస్తాయా లేదోనని ఎదురుచూసిన రైతులకు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా సింగూరు కాలువకు పడ్డ గండ్లు రైతుల్ని మరింత కుంగదీస్తున్నాయి.
రైతులకు ఊహించని షాక్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బస్వాపూర్ చెరువు అలుగు పారి నీరు కాలువలోకి రావడం, మిన్‌పూర్ వద్ద కాలువకు బుంగపడి ఆ నీరంతా చెరువులోకి వెళ్లి అలుగు పారడంతో దిగువన వరిచేలు మునిగిపోయాయి. ఇసోజిపేట వద్ద ఫారెస్టు నీళ్లు కాలువలోకి చేరి ప్రవాహ ఒత్తిడి పెరగడంతో అక్కడ మరో గండి పడి నీరంతా ఫారెస్టు నుంచి మంజీరా నదికి చేరాయి. దీంతో సాగునీటిని నిలిపివేయడంతో రైతులకు ఊహించని షాక్ తగిలింది.
ఆది నుంచి అంతే
వానాకాలం ప్రారంభం నుంచి సింగూరు కాలువలకు సిమెంట్ లైనింగ్ పేరుతో కాలయాపన చేశారు. వానాకాలం ప్రారంభమై రెండు నెలలైనా సిమెంట్ లైనింగ్ ప్రారంభం కాలేదు. అలాగే సాగునీరు విడుదల చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి ఇబ్బంది కలుగుతుందని భావించి కాంగ్రెస్ నాయకులు మంత్రి దామోదరను సంప్రదించి సిమెంట్ లైనింగ్ పనులు ఆపించి వరినాట్లకు నీటిని వదిలారు.
ట్రాక్టర్‌పై వెళ్లి గండ్లను పరిశీలించి..
భారీ వర్షాలు కురుస్తున్నప్పుడే మంత్రి దామోదర రాజనర్సింహ రహదారులు బాగోలేకపోయినా ట్రాక్టర్‌పై జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్య, జిల్లా ఎస్పీ పంకజ్ పరితోశ్, నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి వెళ్లి మరీ తెగిపడ్డ గండ్లను పరిశీలించారు. అక్కడే గండ్లను పూడ్చాలని ఆదేశించారు. ఈ ఘటన జరిగి 25 రోజులు కావొస్తున్నా గండ్లను పూడ్చలేకపోయారు. స్వయంగా మంత్రే ఆదేశించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు గండ్లను పూడ్చి సాగునీటిని సరఫరా చేయాలని రైతులు కోరారు.