విష జ్వరాలతో విలవిల | - | Sakshi
Sakshi News home page

విష జ్వరాలతో విలవిల

Sep 9 2025 12:40 PM | Updated on Sep 9 2025 12:40 PM

విష జ్వరాలతో విలవిల

విష జ్వరాలతో విలవిల

ఆస్పత్రులు కిటకిట

జిల్లాను సీజనల్‌ వ్యాధులు వణికిస్తున్నాయి. జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌, మలేరియా, డెంగీతో బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇదిలా ఉండగా అరకొర మందులు.. వైద్య సిబ్బంది కొరతతో అవస్థలు తప్పడం లేదు. వైద్య పరీక్షలకు రోగులు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. సోమవారం పట్టణ ఆస్పత్రులను ‘సాక్షి’ విజిట్‌ చేయగా పలు విషయాలు వెలుగుచూశాయి.

రోగులకు పరీక్షే

తూప్రాన్‌: పట్టణంలోని సీహెచ్‌సీకి నిత్యం 600పైగా రోగులు వస్తున్నారు. వీరిలో ఎక్కువగా విష జ్వరాలే బాధితులే ఎక్కువ. ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి కిట్లు కరువయ్యాయి. అలాగే మందులు కరువయ్యాయి. దీంతో కొంతమంది ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆస్పత్రిలోనే అన్నిరకాల జబ్బులకు పరీక్షలు నిర్వహించే సదుపాయం కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

మందు గోలీల్లేవ్‌!

రామాయంపేట(మెదక్‌): సీజనల్‌ వ్యాధులతో పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు రోగుల తాకిడి పెరిగింది. సోమవారం ఇద్దరు డాక్టర్లు విధుల్లో ఉన్నారు. రోజూ ఆస్పత్రికి 200కు పైగా రోగులు వస్తుండగా, సోమవారం 9:30 గంటల నుంచి 12 వరకు 155 మంది వచ్చారు. కొన్ని మందులు అందుబాటులో లేవు. ఈ ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్‌ పరిధిలో చేర్చి మూడేళ్లు కావొస్తుండగా, ఇది కాగితాలకే పరిమితమై సీహెచ్‌సీగానే కొనసాగుతోంది. నెలకు రెండు, మూడు కాన్పులు సైతం కావడం లేదు. ఎక్స్‌రే యంత్రం నిరూపయోగంగా ఉండగా, గైనకాలజిస్ట్‌ పోస్టు భర్తీ కాకపోవడం సమస్యగా మారింది.

ఓపీక నశిస్తోంది

నర్సాపూర్‌: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతుంది. సోమవారం 740 మంది ఆస్పత్రిలో అవుట్‌ పేషెంట్లుగా నమోదు చేసుకున్నారు. వారిలో సుమారు 80 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. సుమారు 20 మంది ఇన్‌ పేషెంట్లుగా చేరి వైద్యం పొందుతున్నారు. మిగిలిన వారు మందులు తీసుకొని ఇళ్లకు వెళ్లారు. ఇదిలా ఉండగా రోజుకు 60 నుంచి 80 మంది జ్వర బాధితులు ఆస్పత్రికి వస్తున్నారని, వారిలో 20 నుంచి 25 మంది ఇన్‌ పేషెంట్లుగా చేరి వై ద్యం పొందుతున్నారని వైద్యులు తెలిపారు.

అన్నీ.. సగం సగం

మెదక్‌ మున్సిపాలిటీ: జిల్లా కేంద్ర ఆస్పత్రి రోగులతో కిక్కిరిసింది. ప్రతి రోజు సుమారు 500 నుంచి 1,000 మంది వరకు వస్తున్నారు. సరిపడా మందులు కరువయ్యాయి. రక్త పరీక్షలు కొన్నింటిని ప్రైవేట్‌లో చేయించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌, ప్రమాదాల్లో గాయపడిన వారికి మందులు కరువయ్యాయి. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఓపీ కేంద్రాల వద్ద రోగుల బారులు

గంటల తరబడి నిరీక్షణ

అరకొర మందులు.. వైద్య పరీక్షలు కరువు

‘సాక్షి’ విజిట్‌లో వెలుగుచూసిన వాస్తవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement