లక్ష్యం చేరని సీఎంఆర్‌ | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం చేరని సీఎంఆర్‌

Sep 9 2025 12:40 PM | Updated on Sep 9 2025 12:40 PM

లక్ష్యం చేరని సీఎంఆర్‌

లక్ష్యం చేరని సీఎంఆర్‌

గడువు ముంచుకొస్తున్నా.. కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌ శతశాతం లక్ష్యాన్ని చేరుకోలేదు. గత ఖరీఫ్‌ గడువు ఈనెల 12తో ముగుస్తుంది. కానీ మిల్లర్లు ఇప్పటివరకు 74.64 శాతం బియ్యం మాత్రమే సివిల్‌ సప్లై శాఖకు ఇచ్చారు. అలాగే గత రబీకి సంబంధించి అక్టోబర్‌ 31 వరకు గడువు ఉండగా, ఇప్పటివరకు 32.83 శాతం బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇక 15 ఏళ్లుగా పేరుకుపోయిన బియ్యం బకాయిలు తడిసి మోపెడయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా రికవరీ కావడం లేదు.

– మెదక్‌ అర్బన్‌

జిల్లాలో 37 బాయిల్డ్‌.. 68 రా రైస్‌ మిల్లులు ఉన్నాయి. ఖరీఫ్‌ 2024– 25కు సంబంధించి ఈనెల 12తో సీఎంఆర్‌ రైస్‌ గడువు ముగుస్తుంది. ఆ సీజన్‌కు సంబంధించి 2,67,953 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇచ్చారు. వీరంతా ఈనెల 12 వరకు మొత్తం 1,80,453 మెట్రిక్‌ టన్నుల బియ్యం సివిల్‌ సప్లై శాఖకు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు 1,34,698 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 45,755 మెట్రిక్‌ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. అలాగే గత రబీకి సంబంధించి 2,99,888 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇవ్వగా, ఇందులో 2,03,923 మెట్రిక్‌ టన్నుల బియ్యం రావాలి. కానీ ఇప్పటివరకు 66,944 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. కాగా వీరికి అక్టోబర్‌ 31 వరకు గడువు ఉంది. అయితే అప్పట్లో ధాన్యం తడవడంతో కొంత మేర ఇబ్బంది ఏర్పడిందని, అందువల్ల గడువు పెంచాలని మిల్లర్లు కోరుతున్నారు. కాగా కొంత మంది మిల్లర్లు సీఎంఆర్‌ కోసం ఇచ్చిన ధాన్యం అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

పేరుకుపోయిన బకాయిలు

2010 నుంచి 2024 వరకు జిల్లాలోని 13 మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ బకాయిల కింద రూ. సుమారు రూ. 214 కోట్లు రావాలి. బకాయిల వసూళ్ల కోసం అధికారులు ఆర్‌ఆర్‌యాక్ట్‌ కింద నోటీసులు ఇచ్చారు. కొన్ని మిల్లుల ఆస్తులు యాక్షన్‌ పెట్లారు. అయితే కొంతమంది కోర్టును ఆశ్రయించారు. వివిధ కారణాలతో బకాయిల వసూళ్లు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. ఇందులో కొంతమంది మిల్లర్లు సీఎంఆర్‌ కింద ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకొని రూ. కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. గతేడాది కొన్ని బకాయిలు వసూలు అయినా, ఇంకా పెద్ద మొత్తంలో రావాలని అధికారులు చెబుతున్నారు.

గడువు పెంచాలి

త ఖరీఫ్‌కు సంబంధించి అప్పట్లో అధికారులు 70 రోజుల గ్యాప్‌ ఇచ్చారు. ఈ సమయంలో బీహార్‌ హమాలీలు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ధాన్యం మర ఆడించడంలో జాప్యం జరిగింది. అలాగే ఇటీవల కురిసిన వర్షాలతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల గోదాంలు లేక ధాన్యం తడిసిపోయింది. అందువల్ల గడువు పెంచాలి.

– వీరేశం, రా మిల్లర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి

చర్యలు తీసుకుంటున్నాం

2010 నుంచి మిల్లర్ల దగ్గర సీఎంఆర్‌కు సంబంధించి పేరుకుపోయిన బకాయిల ను వసూలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు బకాయిదారులందరికీ నోటీసులు ఇచ్చాం. కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఆ విషయంలో రిట్‌ పిటిషన్లు వేస్తున్నాం. అవకాశమున్న రైస్‌ మిల్లులను యాక్షన్‌ పెడతాం, వారి ఆస్తుల ద్వారా బకాయిలు వసూలు చేస్తాం.

– జగదీశ్‌ కుమార్‌, డీఎం, సివిల్‌ సప్లై

ఈనెల 12తో ముగియనున్న సేకరణ గడువు

గత ఖరీఫ్‌ 74.64 శాతం, రబీ 32.83 శాతమే పూర్తి

మళ్లీ పొడిగించాలంటున్న మిల్లర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement