
సత్వరమే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ సమస్యలపై ప్రజలు 56 అర్జీలు అందజేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రజావాణిపై నమ్మకాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరైందని, కట్టుకోనివ్వకుండా పాలివాళ్లు అడ్డుకుంటున్నారు. న్యాయం చేయాలని హవేళిఘణాపూర్ మండలం సర్దన గ్రామానికి సాయిలు ప్రజావాణిలో మొరపెట్టుకున్నాడు.
● మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయాను. ప్రభుత్వం నుంచి పెన్షన్ అందడం లేదని రామాయంపేట పట్టణానికి చెందిన గట్ల శ్రీనివాస్ ప్రజావాణిలో వాపోయారు.
మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ నాయకులు యాదగిరి, పాండు, సైదులు డిమాండ్ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్ వచ్చి సమాధానం ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ బైఠాయించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ నగేశ్‌కు అందజేశారు.
నర్సాపూర్ రూరల్: అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను లెక్కించడానికి అధికారులు సోమవారం అడవిబాట పట్టారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, కాగజ్‌మద్దూర్, గొల్లపల్లి, పెద్ద చింతకుంట, నారాయణపూర్, అచ్చంపేట, ఖాజీపేట, నత్నయ్యపల్లి గ్రామాల అడవుల్లో మొక్కలను పరిశీలించి లెక్కిస్తున్నారు. నర్సాపూర్ అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటకుండానే సుమారు రూ. 19 లక్షల బిల్లులు డ్రా చేసుకున్నట్లు సామాజిక తనిఖీ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకొచ్చా రు. దీనిపై అటవీశాఖ అధికారులు మొక్కలు నాటినట్లు ఉన్నతాధికారులకు విన్నవించారు. పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. దీంతో జిల్లాలోని పలు మండలాల ఎ ంపీడీఓలు, ఏపీఓల బృందం మొక్కలు లెక్కించే పనిలో పడ్డారు.
ప్రమాదం అంచున చిన్నచెరువు
రామాయంపేట(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని కాట్రియాల గ్రామాన్ని ఆనుకొని ఉన్న చిన్నచెరువు కట్ట తీవ్రంగా దెబ్బతింది. నాలుగు చోట్ల కోతకు గురై మట్టి కొట్టుకుపోయింది. కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు దెబ్బతిన్న కట్టను పరిశీలించారు. కట్ట తెగితే పన్యాతండాకు ప్రమాదం పొంచి ఉండటంతో తండా వాసులను అక్కడి నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. నీటి పారుదలశాఖ అధి కారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మళ్లీ వర్షం కురిస్తే కట్ట తెగే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. నీటి పారుదల శాఖ ఏఈ సూర్యకాంత్‌ను వివరణ కోరగా, రెండు రోజుల్లో కట్ట మరమ్మతులు ప్రారంభిస్తామని తెలిపారు.