
లబ్ధిదారులకు ఊరట!
మెదక్‌జోన్: జీఎస్టీ తగ్గింపుతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొంత ఊరట కలగనుంది. ఇంటి నిర్మాణాలకు ఉపయోగించే స్టీలు, సిమెంట్ తగ్గింపుతో ఖర్చులు తగ్గనున్నాయి. ఇప్పటివరకు వీటిపై 28 శాతం జీఎస్టీ స్లాబ్ ఉండగా, కేంద్రం 18 శాతానికి తగ్గించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి 180 సిమెంట్ బస్తాలతో పాటు, 1,500 కిలోల స్టీలు అవసరం పడుతుంది. ప్రస్తుతం సిమెంట్ బస్తా ధర మార్కెట్లో రూ. 350 ఉండగా, ఒక్కో బస్తాపై సుమారు రూ. 30 తగ్గే అవకాశం ఉంది. ఈ లెక్కన రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు ఆదా కానుంది. అలాగే స్టీలు టన్ను రూ. 5,500 నుంచి 5,800 వరకు ఉంది. దీనిపై రూ. 8 వేల నుంచి రూ. 9 వేల వరకు ఆదా కానుంది. మొత్తంగా తగ్గిన జీఎస్టీతో ఒక్కో లబ్ధిదారుడికి రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు డబ్బులు ఆదా అవుతాయని సమాచారం. తగ్గిన ధరలు ఈనెల 22 నుంచి అమలులోకి రానున్నాయి.
ఇసుక కోసం తప్పని ఎదురుచూపులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఇప్పటివరకు ఎక్కడా ఉచితంగా ఇవ్వలేదు. ఒక్కో ఇంటికి 10 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంది. ట్రాక్టర్ ఇసుక రూ. 3,500 నుంచి రూ. 4 వేల వరకు వెచ్చించి లబ్ధిదారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన కేవలం ఇసుకకే రూ. 35 వేలు నుంచి రూ. 40 వేల వరకు వెచ్చించాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
త్వరలో ఇసుక సరఫరా
జిల్లాలో ఇసుక క్వారీలు లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి తెప్పించి మెదక్, నర్సాపూర్‌లో డంప్ చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే నర్సాపూర్‌కు కొంత ఇసుకను తెప్పించాం. త్వరలో మెదక్‌కు తెప్పించి ప్రజాప్రతినిధులకు అందిస్తాం. సిమెంట్, స్టీలుపై జీఎస్టీ తగ్గింపుతో లబ్ధిదారులకు కొంతమేర ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
– మాణిక్యం, హౌసింగ్ పీడీ
మంజూరైన ఇళ్లు ప్రారంభించినవి బేస్‌మెంట్ వరకు గోడలు, స్లాబులు పూర్తి బిల్లుల చెల్లింపు
9,000 6,000 2,000 285 రూ. 20 కోట్లు
సిమెంట్, స్టీలుపై తగ్గనున్న జీఎస్టీ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ఖర్చు ఆదా
రూ. 10 నుంచి 15 వేల వరకు మిగులు