
పల్లెల ప్రగతికి ప్రాధాన్యం
● మంత్రి దామోదర రాజనర్సింహ
● రూ. 28.45 కోట్ల రోడ్ల పనులకు శంకుస్థాపన
టేక్మాల్(మెదక్): పల్లెల ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మండలంలో రూ. 28.45 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భ ంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లోకి రవాణా సౌకర్యం బాగుంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. అంతకుముందు కేజీబీవీ, మోడల్ స్కూల్‌ను సందర్శించి మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎల్లుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా బొడ్మట్‌పల్లి, తంప్లూర్ సబ్ సెంటర్లను ఆస్పత్రిలో ఎందుకు కలిపారని వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీవర్ సర్వే పటిష్టంగా అమలు చేయాలని, నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనం ప్రజలకు దూరంగా ఉందన్నారు. స్థల సేకరణలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేశారని, రోడ్డుకు అనుకొని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ తులసీరాం, నాయకులు తదితరులు ఉన్నారు.