
ప్రతీ ఓటు అమూల్యమైనదే
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్/టేక్మాల్(మెదక్): ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు అమూల్యమైందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 21 జెడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు సజావుగా జరిగేలా 1,052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా తదితర విషయాలపై చర్చించారు. జిల్లాలో పురుష ఓటర్లు 2,51,532, మహిళా ఓటర్లు 2,71,787, ఇతరులు 08, మొత్తం 5,23,327 మంది ఓటర్లున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుది జాబితాను ఈనెల 10న ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ, ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు టేక్మాల్ మండలంలోని దనూర ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతలో రాజీపడకుండా మెనూ అందించాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు.