
రేవంత్ ఇవ్వరు.. కేసీఆర్ అడగరు
● వీరికి నిరుపేదల కష్టాలు తెలియవు
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
రామచంద్రాపురం(పటాన్‌చెరు): భూస్వాములైన సీఎం రేవంత్‌రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు నిరుపేదల కష్టాలు ఏం తెలుసని ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో పెన్షన్ పెంపు కోసం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగర్జనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెన్షన్ కుటుంబం నుంచి వచ్చిన తనకు నిరుపేదల కష్టాలు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ వెంటనే పెంపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయం ప్రతిపక్ష నేత కేసీఆర్ అడగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లు వర్గీకరణపై పోరాటం చేసి విజయం సాధించామన్నారు. తమ పోరాల ద్వారా అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. అర్హులైన వారందరికీ రూ. 6 వేల పెన్షన్ ఇచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకులు రాజు, రామారావు, శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బుచ్చేంద్ర, నాయకులు ప్రమోద్, గీత, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.