
యూరియా.. ఏదయా!
అదనుదాటుతోంది ఆదుకోండి..
పంటలు ఎదిగే సమయంలో తీవ్ర కొరత
● జిల్లాలో 3,39,117 ఎకరాల్లో సాగు
● లెక్కలోకి రాని శిఖం, అటవీ భూములు
● నీట మునిగిన 23,159 ఎకరాలు
● రికవరీ చేసుకునే అవకాశం కరువు
తెల్లారితే చాలు.. బస్తా యూరియా కోసం అన్నదాతలు ఆగమవుతున్నారు. ఎరువుల దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. చెప్పుల లైన్లు.. రాస్తారోకోలు.. ఆందోళనలు నిత్యకృత్యమవుతున్నాయి. అదనుదాటిపోతుంది.. ఎలాగైనా ఒక సంచి ఇవ్వండి సారూ.. అంటూ బరువెక్కిన గుండెలతో వేడుకుంటున్నారు.
– మెదక్ అర్బన్
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 3,39,117 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయగా.. సుమారు 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 22,605 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు చెబుతున్నారు. కాగా శిఖం, ఫారెస్ట్ భూముల్లో వేసిన పంటలను లెక్కలోకి తీసుకోకపోవడం.. కొంతమంది ఆందోళనతో యూరియా స్టాక్ పెట్టడం.. పక్క జిల్లాలకు తరలిపోవడం, సకాలంలో రాకపోవడం కొరతకు కారణంగా భావిస్తున్నారు. వ్యవసాయాధికారులు కేవలం రికార్డుల్లో ఉన్న భూములనే లెక్కిస్తారు. మంజీరా తీర ప్రదేశాలు, ఫారెస్ట్ భూములు, చెరువు శిఖంలో అక్రమంగా వేసిన పంటలు లెక్కించరు. జిల్లాలో రికార్డులకెక్కని భూముల్లో సాగు చేసిన పంటలు వేల ఎకరాల్లో ఉంటుందని సమాచారం. దీంతో యూరియా వినియోగం సైతం ఎక్కువగానే ఉంటుంది. కొరత నేపథ్యంలో కొంతమంది రైతులు సెప్టెంబర్ నెలకు అవసరమయ్యే ఎరువులను ఆగస్టులోనే తీసుకున్నారు. కాగా డిమాండ్‌కు అనుగుణంగా యూరియా సరఫరా కాలేదనే విమర్శలున్నాయి. ముడి సరుకుల దిగుమతి తగ్గడం కూడా కొరతకు కారణంగా విశ్లేషిస్తున్నారు. వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో చెరువుల కింద ఉన్న రైతులు ఒకేసారి పంటలు వేశారు. వీరందికీ ఒకేసారి యూరియా అవసరమవడం కొరతకు మరో కారణం అంటున్నారు.
చెరువుల కింద జూలై చివరి, ఆగస్టు మొదటి వారంలో నాట్లు వేసిన రైతులకు యూరియా ఇప్పుడు అవసరమవుతోంది. కనుక అదను దాటిపోతుంది.. ఒక్క బస్తా ఇవ్వండి సారూ అంటూ రైతులు వేడుకుంటున్నారు. అలాగే చిరుపొట్ట దశలో పైరులకు యూరియా అవసరమవుతుంది. ఇప్పుడు ఎరువు వేయకపోతే పంట దిగుబడి సరిగా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివ్వంపేట మండలంలో 1,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ఇప్పటివరకు 800 మెట్రిక్ టన్నులు, హవేళిఘణాపూర్‌లో 1,710 మెట్రిక్ టన్నులకు 800, పాపన్నపేటలో 2,400 మెట్రిక్ టన్నులకు 2,100 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నశంకరంపేటలో వారం రోజులుగా యూరియా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పంట ఎదుగుదల లోపించడం, తెగుళ్లు వ్యాపించడంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు అతివృష్టితో నీట మునిగిన పంటలను రికవరీ చేసుకునే అవకాశం కరువైంది.