
అద్దింట్లో ఆర్టీఏ ఆఫీస్
● వాహనదారులకు తప్పని ఇబ్బందులు
● రూ. కోట్ల ఆదాయం ఉన్నా.. కనీస వసతులు కరువు
రామాయంపేట(మెదక్): ఏటా ప్రభుత్వానికి రూ. కోట్ల ఆదాయం సమకూరుస్తున్న జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మెదక్ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో పురాతనమైన అద్దె భవనంలో కార్యాలయం కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి వసతులు లేకపోగా, రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్, డ్రైవింగ్ టెస్టుల నిమిత్తం వచ్చే వాహనదారులతో పాటు కార్యాలయ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. డ్రైవింగ్ టెస్ట్, ఫిట్‌నెస్ పరీక్షల కోసం ప్రత్యేకంగా ట్రాక్ సదుపాయం లేదు. నాలుగు చక్రాలు, ద్విచక్ర వాహనదారులకు వేర్వేరుగా ట్రాక్‌లు అవసరం కాగా, అది కూడా కరువైంది. నామమాత్రంగా హద్దులు పాతి పనులు కానిస్తున్నారు. దీంతో వాహనదారులు తమ డ్రైవింగ్ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. చిన్నపాటి వర్షం కురిసినా కార్యాలయం ఆవరణ బుదరమయంగా మారి తరచూ సేవలకు ఆటంకం కలుగుతోంది.
చెట్ల కిందే విశ్రాంతి..
మెదక్ పట్టణ శివారులో పాక్షికంగా శిథిలమైన భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేయించిన ఆశాఖ అధికారులు, అందులోనే కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఎల్లవేళలా రద్దీగా ఉండే ఈ కార్యాలయానికి నిత్యం ప్రజలు వస్తుంటారు. ఇందులో కనీసం కూర్చొడానికి సైతం సదుపాయాలు లేవు. తాగునీటి సదుపాయం, మూత్రశాలలు సక్రమంగా లేకపోవడం మరింత బాధాకరంగా మారింది. పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న వాహనదారులు చెట్ల కిందే విశ్రాంతి తీసుకుంటున్నారు. కార్యాలయ ఆవరణలో ఫిట్‌నెస్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. కార్యాలయం ముందున్న కొద్దిపాటి స్థలం మట్టి రోడ్డుతో కూడుకొని ఉంది. ఇందులో హద్దులు పాతి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి చినుకులు కురిస్తే కార్యాలయం ఆవరణ మొత్తం బుదరమయం అవుతోంది. వర్షం పడినప్పుడల్లా పనులు వాయిదా పడుతున్నాయి. దీంతో వాహనదారులు మళ్లీ రావాల్సి వస్తోంది.
పక్కా భవనానికి చర్యలు
జిల్లా రవాణాశాఖ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తున్న వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం. పక్కా భవన నిర్మాణానికి గాను మెదక్ మండలం పాతూరు వద్ద గతంలోనే స్థల సేకరణ జరిగింది. నిర్మాణానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నాం.
– వెంకటస్వామి, జిల్లా రవాణా అధికారి

అద్దింట్లో ఆర్టీఏ ఆఫీస్