జ్వరమొచ్చింది | - | Sakshi
Sakshi News home page

జ్వరమొచ్చింది

Sep 7 2025 8:37 AM | Updated on Sep 7 2025 8:37 AM

జ్వరమ

జ్వరమొచ్చింది

20 డెంగీ, 84 టైఫాయిడ్‌ కేసుల నమోదు 18వేల పైచిలుకు వైరల్‌ బాధితులు జ్వరంతో ఇద్దరు విద్యార్థుల మృతి 10 మందిలో ఒక్కరిద్దరికి వైరల్‌ ఫీవర్‌

ప్లేట్‌లెట్స్‌ తగ్గటం మామూలే

మెదక్‌జోన్‌: మెతకు సీమ మెదక్‌ మంచం పట్టింది. జిల్లాలో వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌, డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. ప్రతీ పదిమందిలో ఒక్కరిద్దరు చొప్పున వైరల్‌ జ్వరం బారిన పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో జ్వరం బారిన పడి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. భారీవర్షాలు, వాతావరణ మార్పులు, అపరిశుభ్రత కారణంగా దోమలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చేస్తున్నాయి.

కిక్కిరిసిన ఆస్పత్రులు

జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రైవేటు హాస్పిటళ్లు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 20 డెంగీ, 84 టైఫాయిడ్‌, 18,424 వైరల్‌ ఫీవర్‌ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 5,904 ఫీవర్‌ కేసులు నమోదు కావడం జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. శివ్వంపేట మండలం తునిఖి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి సుమన్‌, 5వ తరగతి విద్యార్థి సుశాంక్‌ జ్వరంబారిన పడ్డారు. వీరిని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందడమే ఇందుకు నిదర్శనం.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్ల దందా!

వైరల్‌ ఫీవర్‌తోపాటు టైఫాయిడ్‌, డెంగీ కేసులు నమోదైన రోగుల్లో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులు దందా సాగిస్తున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా రెండు నుంచి వారం రోజులపాటు రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకుని రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. డెంగీ రోగికి ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి వస్తే వెంటనే వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్‌ చేస్తున్నారు. జిల్లాకు వైద్య కళాశాల వచ్చినా అన్నిరకాల ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నా సరైన పరికరాలు లేకపోవటంతో హైదరాబాద్‌కు రిఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌, డెంగీ వచ్చి న వారిలో ప్లేట్‌లెట్స్‌ తగ్గడం మామూలే. ప్లేట్‌లెట్స్‌ తగ్గితే ఆందోళన అనవసరం. ఎవరైనా జిల్లా కేంద్ర ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుని అక్కడే చికిత్సలు పొందవచ్చు. ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరి అనవసరంగా అప్పులపాలు కావొద్దు.

– శ్రీరామ్‌, జిల్లా వైద్యాధికారి,

మెదక్‌

అపరిశుభ్రతే కారణం

భారీవర్షాల కారణంగా పల్లెల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. ఫలితంగా దోమలు పెరిగి వ్యాధులకు ప్రధాన కారణం అవుతున్నాయి. పల్లెల్లో 2 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు లేకపోవటం, ప్రత్యేకాధికారులు అటుగా తొంగి చూడకపోవటంతో పల్లెలో అపరిశుభ్రత కారణంగా ప్రజలు మంచం పడుతున్నారు.

జ్వరమొచ్చింది1
1/1

జ్వరమొచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement