
కాలేజీకి డుమ్మా కుదరదిక
ఇంటర్ విద్యార్థులకు ముఖ గుర్తింపు రోజుకు రెండుసార్లు ఎఫ్‌ఆర్‌ఎస్ గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం జిల్లాలో 62 కళాశాలలు, 13,123 మంది విద్యార్థులు
జిల్లాలో 16 ప్రభుత్వ, 36 గవర్నమెంట్ సెక్టార్, 10 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కలిపి మొత్తం 60 కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 6,068, ద్వితీయ సంవత్సరంలో 7,055 కలిపి మొత్తం 13,123 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. టీజీబీఐఈ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ అందజేశారు. లెక్చరర్లు యాప్ ఓపెన్ చేయగానే ఉదయం బోధించే తరగతి, విద్యార్థుల వివరాలు కనిపిస్తాయి. విద్యార్థి పేరుపై క్లిక్ చేయగానే, కెమెరా ఓపెన్ అవుతుంది. వెంటనే విద్యార్థి ముఖంపై క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇంటర్మీడియెట్ స్థాయిలో ముఖ గుర్తింపు విధానం ప్రారంభమైంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులతో పాటు సిబ్బందికి ఈ విధానం అమలు పరుస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మొదట కొంతమంది టీచర్లు వ్యతిరేకించినప్పటికీ.. ఇటీవల ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత హాజరుశాతం.. సమయపాలన.. ఖచ్చితంగా అమలవుతోంది. – మెదక్ అర్బన్
త్వరలో లెక్చరర్లకు..
ఇంటర్ విద్యార్థులకు రోజుకు రెండుసార్లు ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంతో అటెండెన్స్ తీసుకుంటున్నారు. ముఖ గుర్తింపు హాజరు ద్వారా విద్యార్థి కళాశాలకు హాజరు కాకుంటే, వారి తల్లిదండ్రుల ఫోన్‌లకు మెసేజ్ వెళ్తుంది. ఈ హాజరును సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు సమీక్షిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమల్లోకి వచ్చినా, లెక్చరర్లకు మాత్రం అమలు కావడం లేదు. గతంలో వారికి బయోమెట్రిక్ విధానం అమల్లో ఉండేది. ప్రస్తుతం అది పనిచేయడం లేదు. కాగా వీరికి కూడా త్వరలోనే ఎఫ్‌ఆర్‌ఎస్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.