
నేడు దుర్గమ్మ దర్శనం నిలిపివేత
పాపన్నపేట(మెదక్): సంపూర్ణ చంద్రగ్రహణా న్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి వన దుర్గమ్మ దర్శనాన్ని నిలిపి వేస్తామని ఈఓ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి 12 గంటల వరకు రాజగోపురంలో పూజలు. దర్శనం కొనసాగుతాయని పేర్కొన్నారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం.5.30 గంటల నుంచి తిరిగి అమ్మవారి దర్శనం ప్రారంభ మవుతుందని చెప్పారు. మంజీర వరదల వల్ల దుర్గమ్మ రాజగోపురం వద్ద పూజలు జరుగుతున్న విషయం విదితమే.
వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలి
డీఎంహెచ్‌ఓ శ్రీరామ్
హవేళిఘణాపూర్(మెదక్): ప్రస్తుత సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధి సర్ధన పీహెచ్‌సీని సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్నందున ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం సర్ధన బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. డీఎంహెచ్‌ఓ వెంట నారాయణ, హరిప్రసాద్, నవ్య, మండల వైద్యాధికారి వినయ్, సిబ్బంది ఉన్నారు.
కార్మికుల హక్కులను
కాల రాస్తున్న కేంద్రం
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
చుక్క రాములు
మెదక్ కలెక్టరేట్: పెట్టుబడి దారుల కోసం కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా అమలు చేస్తున్న లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలేదన్నారు. అలాగే పరిశ్రమలలో కాంట్రాక్టు కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు. జిల్లాలో మొదటి సారిగా సీఐటీయూ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, ఆడివయ్య సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, కోశాధికారి నర్సమ్మ, బస్వరాజు, గౌరీ, నాగరాజు, నాగేందర్ రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.
సరిపడా యూరియా
అందించండి
హుస్నాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా అందించాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య, ప్రధాన కార్యదర్శి గన్నెబోయిన వెంకటాద్రి డిమాండ్ చేశారు. శనివారం మాట్లాడు తూ రాష్ట్రంలో సహకార సంఘాల వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి నష్టపోతారని, అవసరానికి తగ్గట్లుగా గోదాముల్లో యూరియా నిల్వ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు దుర్గమ్మ దర్శనం నిలిపివేత