
తప్పుదోవ పట్టించొద్దు
హౌజింగ్ పీడీ మాణిక్యం
మెదక్ కలెక్టరేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు తప్పుదోవ పట్టించ వద్దని, వారికి బిల్లులు రాకుండా నష్టం జరిగే ప్రమాదం ఉందని హౌసింగ్ పీడీ మాణిక్యం పేర్కొన్నారు. హవేళిఘణాపూర్ మండలం తొగిట, సర్ధన గ్రామాల్లో పర్యటించి ఇళ్ల నిర్మాణాలు పరిశీలించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తున్న లబ్ధిదారులకు వారం వారం బిల్లులు అందజేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 2వేల మంది లబ్ధిదారులకు రూ.20కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ వారం 296 మంది లబ్ధిదారులకు రూ.2.96కోట్లు మంజూరు కాగా.. వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన తరువాత మేసీ్త్రలు అధికంగా కూలీలు పెంచారని, దీంతో లబ్ధిదారులకు ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. ఫీట్ల పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేస్తున్న మేసీ్త్రలు నిర్మాణం వ్యయం పెరిగేలా వారికి సలహాలు ఇస్తున్నారని, దీంతో లబ్ధిదారులకు అప్పులపాలయ్యే ప్రమాదం ఉందన్నారు. పెద్ద ఎత్తున పిల్లర్లు వేసి అప్పులపాలు కావొద్దని సూచించారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు.