
నష్టంపై అంచనాలు రూపొందిస్తాం
రామాయంపేట(మెదక్)/నిజాంపేట/హవేళిఘణాపూర్: భారీ వర్షాలతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఆదివారం మండలంలోని పర్వతాపూర్, నిజాంపేట మండలంలోని నందిగామ, చల్మెడ, నిజాంపేట, హవేళిఘణాపూర్ మండలం బాలానగర్‌లో పర్యటించారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద నష్టంపై ఆయా శాఖల అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. తాత్కాలిక మరమ్మతులతో రవాణాను పునరుద్ధరించాలని ఆదేశించామన్నారు. తీవ్రస్థాయిలో పంట నష్టం జరిగి పొలాల్లో ఇసుక మేటలు వేసిందన్నారు. జిల్లావ్యాప్తంగా 130 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు. కాట్రియాల చెరువు కట్ట ప్రమాదకరంగా మారడంతో ప్రజలను ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల్లో ఉంచామని వివరించారు. ఈమేరకు అన్నిశాఖల్లో ఉద్యోగుల సెలవులు రద్దు చేశామని, ఇంకా వరద ముప్పు తొలగిపోలేదని పేర్కొన్నారు. ఆయన వెంట సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్