
డెంగీ లేదు.. వైరల్ ఫీవరే
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి గ్రామంలో ఎవరికి డెంగీ నిర్ధారణ కాలేదని, వైరల్ ఫీవర్ మాత్రమేనని డీఎంహెచ్‌ఓ శ్రీరాం తెలిపారు. ఆదివారం గ్రామంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజనతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో వైద్య సిబ్బంది నాలుగు టీంల ద్వారా ఫీవర్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. వైద్య శిబిరంలో 60 మందికి చికిత్స చేయగా ఆరుగురికి జ్వరం ఉందన్నారు. రక్త పరీక్షలు చేయించగా, వైరల్ ఫీవర్ ఉందని తేలిందన్నారు. వారం రోజుల పాటు గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, పంచాయతీ కార్యదర్శి సౌజన్య వైద్యసిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ శ్రీరాం