
ఏమనాలా..!
రామాయంపేట(మెదక్): భారీ వర్షం కురిస్తే చాలు పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. పలు కాలనీల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మున్సిపా లిటీ పరిధిలో కొందరు నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు ఇళ్లు, దుకాణాల్లోకి చేరి అవస్థలు పడుతున్నారు. తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో వరద పలు కాలనీల్లో సెల్లార్లు, ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. అటవీ ప్రాంతంతో పాటు ఎత్తయిన గుట్టలపై కురిసిన వర్షం నీరు నాలా ద్వారా మల్లె చెరువుతో పాటు ఇతర చెరువుల్లో కలిసేది. ప్రధాన నాలాకు అడ్డంగా ఏకంగా కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టగా, రెండు, మూడు రోజుల క్రితం భారీస్థాయిలో కురిసిన వర్షంతో వరద నీరు సాఫీగా వెళ్లకుండా దారి మళ్లి ఇళ్లు, దుకాణాల్లోకి చేరింది. దీంతో నాలా పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్, దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దుకాణాలు, టెంట్ హౌస్‌లోని సామగ్రి, ఇతర వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీరు రెండు రోజల పాటు ప్రధాన రహదారిపై పారి రాకపోకలు స్తంభించా యి. గతంలో కొందరు నాలాపై అక్రమంగా పిల్లర్లు వేసి స్లాబ్ పోయగా, మరి కొందరు కాలువకు అడ్డంగా గది నిర్మించారు. కొందరు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సైతం వారికి పరోక్షంగా సహకరించినట్లు ఆరోపణలున్నాయి. ఈవిషయమై స్థానికులు పలుమార్లు కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిసింది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహ నాలాపై అక్రమ నిర్మాణాలను గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు. కాగా మున్సిపల్ అధికారులు ఇంకా నాలాలపై అక్రమ నిర్మాణాలు పూర్తిస్థాయిలో తొలగించలేదు. మంత్రి ఆదేశాలను బేఖా తరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాలాలపై అక్రమ నిర్మాణాలు
భారీ వర్షంతో తీవ్ర నష్టాలు
మంత్రి ఆదేశించినా పట్టని అధికారులు

ఏమనాలా..!