
పనిచేయని వారిని ఇంటికి పంపండి
మెదక్ కలెక్టరేట్: పనిచేయని వారికి మెమోలు జారీ చేసి ఇంటికి పంపించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ డీఆర్‌ఓ భుజంగరావును ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని అవుట్, ఇన్‌వార్డ్ సెక్షన్, ఖజానా శాఖ, ఎన్‌ఐసీ కార్యాలయాలను తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. ఉదయం 11:30 అవు తున్నా కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో ఉండాల్సిన ఎన్‌ఐసీ ఉద్యోగి సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు. మెమో జారీ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్నిశాఖల అధికారులు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నందున సోమవారం హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రజావాణి ఉంటుందని కలెక్టర్ చెప్పారు. అలాగే వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఆదివారం అన్నిశాఖల అధికారుల సెలవు రద్దు చేసినట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆయా పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు.
పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం
హవేళిఘణాపూర్(మెదక్): అధికారులు పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం భారీ వర్షాలతో కొట్టుకుపోయిన రోడ్లు, నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. మండల పరిధిలోని రాజ్‌పేట నుంచి కప్రాయిపల్లి బ్రిడ్జిని పరిశీలించేందుకు బైక్‌పై వెళ్లారు. త్వరలోనే తాత్కాలిక మరమ్మతులు చేసి గ్రామస్తులకు రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దూప్‌సింగ్ తండా, బ్రిడ్జిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనం చేసే కొంటూర్ చెరువు వద్ద ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.
అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం