
ట్రయల్ రన్ సక్సెస్.. రైళ్లు షురూ
చిన్నశంకరంపేట(మెదక్)/రామాయంపేట: భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా పరిధిలో ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్– నిజామాబాద్ మార్గంలో గత మూడు రోజులుగా రద్దయిన రైళ్లు శనివారం ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం గూడ్స్ రైలును ట్రయల్ రన్ చేశారు. అనంతరం ప్యాసింజర్ ప్రత్యేక రైలును నడిపారు. ఈ రైలుకు మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, వడియారం, అక్కన్నపేటలో హాల్టింగ్ ఇచ్చారు. ఇది క్షేమంగా నిజామాబాద్ చేరుకోవడంతో మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపారు. విశాఖ, సంబల్‌పూర్ రైళ్లు మధ్యాహ్నం వరకు నిజామాబాద్ వైపు వెళ్లాయి. అలాగే కాచిగూడ– బోధన్, కాచిగూడ– నిజామాబాద్, కాచిగూడ– పూర్ణ రైళ్లు నడవనున్నాయి. ఈ మూడు రైళ్లను నిజామాబాద్ వరకు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా మెదక్ వైపు వెళ్లే ట్రాక్‌కు ఇంకా మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈమార్గంలో నడిచే రైళ్లు ప్రారంభం కాలేదు.