
ముందుకు సాగని ఎవుసం
● జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల అంచనా ● ఇప్పటివరకు సాగైంది 66 వేలే.. ● అందులో వర్షాధార పంటలు 39 వేలు
మెదక్‌జోన్: అదును దాటుతున్నా ఎవుసం ము ందుకు సాగడం లేదు. ఏటా ఈ సమయానికి సంబురంగా సాగే వ్యవసాయ పనులు ఈసారి మాత్రం వరుణుడి జాడ లేక, జల వనరులకు సాగు నీరందక ఆలస్యమవుతోంది. ఈఏడాది జిల్లావ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 66 వేల ఎకరాలు మాత్రమే రైతులు సా గు చేశారు. ఈ లెక్కన కేవలం 18 శాతం పంటలు మాత్రమే సాగయ్యాయి.
వరి 27 వేల ఎకరాలకే పరిమితం
వ్యవసాయశాఖ అధికారుల అంచనా ప్రకారం ఈఏడాది జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలు 3,50,164 ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. ఇందులో సింహభాగం వరి 3.05 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు వరి కేవలం 27 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అది కూడా బోరుబావుల కిందే. మిగితా 39 వేల ఎకరాల్లో పత్తి, కంది, మొక్కజొన్న, పెసర, మినుములు, స్వీట్‌కార్న్ లాంటి ఆరుతడి పంటలను వర్షాధారంగా రైతులు సాగు చేశారు. గతేడాది జూలై నెలాఖరు వరకు సుమారు 2 లక్షలపై చిలుకు ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు చెబుతున్నారు.
లోటు వర్షపాతం నమోదు
జూన్ 1 నుంచి జూలై 20 వరకు జిల్లాలో 241.8 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 185.6 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ లెక్కన ఇప్పటివరకు 56.2 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదు అయింది.
ముదురుతున్న వరినార్లు
రైతులు జూన్ మొదటివారంలో నారుమ ళ్లు పోస్తారు. అప్పటినుంచి 25 రోజుల్లో వరినాటు వేస్తేనే అధిక దిగుబడి వస్తుంది. అంటే జూలై మొదటి వారం వరకు వరి నాట్లు పూర్తి కావాలి. కానీ జూలై మూడో వారం పూర్తి కావొస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 18 శాతం సాగు పూర్తయింది. నారు ముదిరితే దిగుబడి ఆశించిన మేర దిగుబడి రాదు. కాగా ఆగస్టు 15వ తేదీ వరకు వరి నాట్లు వేసుకునే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
కరుగుతున్న కార్తెలు !
కార్తెలు కరిగిపోతున్నా జిల్లాలో ఆశించిన మేర వర్షాలు కురవటం లేదు. ఇప్పటివరకు చెరువు, కుంటల్లోకి నీరు చేరలేదు. కేవలం బోరుబావుల ఆధారంగా రైతులు పంటలను సాగు చేశారు. వర్షాలు ఆశించిన మేర కురిస్తే చెరువు, కుంటల్లోకి నీరు చేరి ఆయకట్టు భూముల్లో రైతులు వరినాట్లు ముమ్మరంగా వేస్తారు. అంతేకాకుండా భూగర్భజలాలు సైతం పెరిగే అవకాశం ఉంటుంది.