
ప్రకృతి, సేంద్రియ సాగు చేయాలి
తునికి కేవీకేలో ఎస్సీ రైతుల శిక్షణ కార్యక్రమంలో ఎన్‌ఏఏఆర్‌ఎం డైరెక్టర్ డాక్టర్ గోపాల్‌లాల్
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రతి రైతు తప్పనిసరిగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేయాలని ఎన్‌ఏఏఆర్‌ఎం డైరెక్టర్ డాక్టర్ గోపాల్‌లాల్ తెలిపారు. మంగళవారం మండలంలోని తునికివద్దగల డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ఎస్సీ రైతులకు ప్రకృతి, సేంద్రియ వ్యసాయంపై ఐదు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా ముగింపు కార్యక్రమానికి ఎన్‌ఏఏఆర్‌ఎం (నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చ్ మేనేజ్‌మెంట్) డైరెక్టర్ డాక్టర్ గోపాల్‌లాల్ ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు ఆరోగ్యం కోసం ప్రకృతి, సేంద్రియ సాగు చేయాలన్నారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు మోతాదుకుమించి వాడటంతో భూమి, ఆహార ఉత్పత్తులు కలుషితం అవుతున్నాయని చెప్పారు. ప్రకృతి, సేంద్రియ సాగుతో భూమి, ఆహార పంటలు బాగుంటాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈసందర్భంగా శిక్షణ పొందిన తునికి, రాయిలాపూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 40మంది ఎస్సీ రైలులకు శిక్షణ సర్టిఫికెట్, బ్యాగ్, ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే పంచగవ్య, వావిలాకు కషాయం, వానపాముల ఎరువుతోపాటు జీవాంమృతం తయారికి డ్రమ్ములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఏఏఆర్‌ఎం సైంటిస్ట్ డాక్టర్ బాలకృష్ణ, కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీదత్తాత్రేనల్కర్, శాస్త్రవేత్తలు రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్, ఉదయ్‌కుమార్, భార్గవితోపాటు రైతులు పాల్గొన్నారు.