మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి

Jul 18 2025 1:31 PM | Updated on Jul 18 2025 1:31 PM

మహిళల

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

హామీల అమలుకు నిరంతరం శ్రమిస్తున్నాం

మహిళాశక్తి సంబరాల్లో మంత్రి వివేక్‌ వెంకటస్వామి

మెదక్‌జోన్‌/నర్సాపూర్‌: తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో మహిళలను భాగస్వాములను చేస్తూ, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సహిస్తున్నామని కార్మికశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి పోటీ చేశారని గుర్తు చేస్తూ, ఆమె పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని కొనియాడారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు పెట్రోల్‌ బంకులు ఇస్తున్నామని, నర్సాపూర్‌లో ప్రభుత్వ భూమి కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలు పొందిన మహిళలు సకాలంలో వాయిదాలు చెల్లించాలని సూచించారు. ఎలక్ట్రిక్‌ బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, మహిళలకు మెప్మా పథకం కింద రూ. 2.55 కోట్ల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే వెల్దుర్తి మండలంలోని నాగ్సాన్‌పల్లి, హకీంపేట రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ మహిపాల్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆయా సొసైటీల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి వివేక్‌కు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, నాయకులు తదితరులు స్వాగతం పలికి సన్మానించారు.

గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది

మెదక్‌ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సంబరాలకు మంత్రి హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్లు అప్పు చేసిపెట్టిందని, అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. మహిళలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు, మహిళలకు ప్రధాని మోదీ అమలు చేసిన 33 శాతం రిజర్వేషన్లను రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అమలు చేయా ల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్‌షాపులను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో మెదక్‌ ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని, 18 నెలల్లోనే అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మహిళకు కారు నడపటం రావాలని, మహిళలు డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు తానూ కా రును బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఆ కారును డీఆర్‌డీఓకు అప్పగిస్తానని తెలిపారు.

మెదక్‌ కలెక్టరేట్‌: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని, ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా అధికారులు పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మెగా వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కలెక్టరేట్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. వివిధశాఖల ప్రగతి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధతో విద్యా, వైద్యంతో పాటు సంక్షేమం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అధికారులు మరింత సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి1
1/1

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement