
దోషులను కఠినంగా శిక్షించాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
కొల్చారం(నర్సాపూర్): దళిత నాయకుడు అనిల్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీస్‌శాఖను ఆదేశించామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. గురువారం పైతర గ్రామంలో అనిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న అనిల్‌ను హత్య చేయడం బాధాకరమన్నారు. హత్య చేసిన వారిపై వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. అనిల్ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని, అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆయన వెంట మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ మహ్మద్‌గౌస్, డీబీఎస్ జిల్లా అధ్యక్షుడు శంకర్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, దళిత నాయకుడు బాబు తదితరులు ఉన్నారు.