
అటవీ భూమి కబ్జా
రామాయంపేట(మెదక్): ఐదెకరాల మేర అటవీ భూమిని కబ్జా చేసిన గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఆశాఖ అధికారులు సదరు భూమిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పర్వతాపూర్ పంచాయతీ పరిధిలో బాపనయ్య తండాకు చెందిన కొందరు తండాను ఆనుకొని ఉన్న అటవీ భూమిపై కన్నేశారు. రాత్రి సమయంలో ట్రాక్టర్లు, జేసీబీలతో చెట్లను తొలగించి సదరు భూమిని చదును చేశారు. సమాచారం అందుకున్న మెదక్ అటవీశాఖ రేంజ్ అధికారి మనోజ్‌కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి ఖుద్బొద్దీన్ తమ సిబ్బందితో వెళ్లి కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. చెట్లను తొలగించి అటవీ భూమిని కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారితోనే మళ్లీ మొక్కలు నాటిస్తామని చెప్పారు. కాగా అటవీశాఖ అధికారులు ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకొని మెదక్ తరలిస్తుండగా, గిరిజనులు కొందరు అడ్డుకున్నారు. దీంతో వారిని సముదాయించారు. ఎవరైనా అక్రమంగా అటవీ భూములు కబ్జా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తంగా ఉండాలి
చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్)/రామాయంపేట: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ శ్రీరాం అన్నారు. బుధవారం చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ప్రజలకు వివరించాలని సూ చించారు. ఆశావర్కర్లు, సిబ్బంది గ్రామాల్లో సందర్శించి ఎప్పటికప్పుడు ఆరోగ్య సంబంధిత వివరాలను సేకరించాలన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ నవ్య, మెడికల్ ఆఫీసర్ అనిల్‌కుమార్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అలాగే రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
హవేళిఘణాపూర్(మెదక్): పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పీఆర్టీయూ టీఎస్ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యానాయక్ అన్నారు. బుధవారం మెదక్ మండల పరిధిలోని మాచవరం, మంభోజిపల్లి, రాజుపల్లి, మక్తభూపతిపూర్ తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల సాధనలో పీఆర్టీయూ టీఎస్ ముందు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు శ్రీనివాస్, గోపిచంద్, సత్యనా రాయణరెడ్డి, మల్లారెడ్డి, సతీశ్‌రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
19న జిల్లాస్థాయి
అథ్లెటిక్స్ ఎంపికలు
మెదక్‌జోన్: ఈనెల 19వ తేదీన జిల్లాస్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీ లు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 20 ఏళ్లలోపు బాల, బాలికలకు అవకాశం ఉంటుందన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు వచ్చేనెల 3, 4వ తేదీలలో వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కాగా ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణపత్రం తీసుకురావాలని సూచించారు.

అటవీ భూమి కబ్జా

అటవీ భూమి కబ్జా