సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మా రాయి. అవినీతి నిరోధకశాఖ అధికారులు అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటికీ ఈ శాఖలో కొందరు అధికారుల వసూళ్ల దందా మాత్రం ఆగడం లేదు. ముడుపులు ముట్టజెప్పనిదే డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ కావడం లేదనేది బహిరంగ రహస్యంగా మారింది. 10 నెలల క్రితం సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్ల దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నోట్ల కట్టలను కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం రేపింది. తాజాగా గురువారం సదాశివపేట ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో నగదు పట్టుబడగా, కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు పట్టుబడ్డారు.
రోజుకు రూ.లక్షల్లో
చేతులు మారుతున్న ముడుపులు..
ఆయా స్థిరాస్తి విలువను బట్టి ఒక్కో డాక్యుమెంట్‌కు కనీసం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల చొప్పున ముడుపులు పుచ్చుకోవడం ఈ కార్యాలయాల్లో పరిపాటిగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (ఎస్‌ఆర్‌ఓ) ఉన్నాయి. అత్యధికంగా పటాన్‌చెరు జాయింట్ –1, జాయింట్–2, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ తదితర ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాల్లో ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఒక్కో కార్యాలయంలో సగటు న 30 నుంచి 90 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఏదైనా ముహూర్తం, మంచి రోజులు ఉన్న రోజుల్లో ఈ కార్యాలయా ల్లో వందకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఈ లెక్కన ఒక్కో కార్యాలయంలో రోజుకు కనీసం 50 డాక్యుమెంట్లకు రూ. 2.50 లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ముడుపులు చేతులు మారుతున్నాయి. డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువ ఉన్న రోజుల్లో కొన్ని కార్యాలయాల్లో రూ.ఐదు లక్షలకు మించి ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి.
డాక్యుమెంట్ రైటర్లే కీలకం..
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలకు కొందరు డాక్యుమెంట్ రైటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్ రైటర్లు, దళారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లకూడదు. కానీ వీరు ఏకంగా ఎస్‌ఆర్‌ఓల క్యాబిన్లలోకే దర్జాగా చొచ్చుకుని పోయి..పక్కనుంచి మరీ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండటం పరిపాటైపోయింది. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ విధానం వంటి సంస్కరణలు ప్రభుత్వం తెస్తున్నప్పటికీ ఈ కార్యాలయాల్లో అక్రమాలు మాత్రం ఆగకపోవడం గమనార్హం.
వివాదాస్పద డాక్యుమెంట్లతో కాసుల పంట
వివాదాస్పదమైన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఈశాఖ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.లక్ష చొప్పున ముడుపులు పుచ్చుకుని రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. లింకు డాక్యుమెంట్లు లేని స్థిరాస్తులు, కోర్టు వివాదాల్లో ఉన్న నివాస స్థలాలు, ఒకే భూమిలో రెండుసార్లు లేఅవుట్ చేసిన ప్లాట్లు, అనుమతి లేని లేఅవుట్‌లలో స్థలాలు, ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లు ఇలా వివిధ రకాల వివాదాస్పద డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లలో రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అవినీతికి నిలయాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
చక్రం తిప్పుతున్న డాక్యుమెంట్ రైటర్లు
నిత్యం రూ.లక్షల్లో
చేతులు మారుతున్న ముడుపులు
ఏసీబీ సోదాలు చేస్తున్నా ఆగని దందా