
చెత్త కదలదు.. మురుగు పోదు
● అధ్వానంగా పేట మున్సిపాలిటీ
● అపహాస్యమవుతున్న వంద రోజుల ప్రణాళిక
● ఇబ్బంది పడుతున్న ప్రజలు
మున్సిపాలిటీ వివరాలు
జనాభా (సుమారు) 25,000
పారిశుద్ధ్య కార్మికులు 37
ఇతర సిబ్బంది 23
చెత్త సేకరణ ట్రాక్టర్లు 3
ఆటోలు 3
ప్రతి రోజు సేకరిస్తున్న చెత్త 8 మెట్రిక్
టన్నులు
పేరుకుపోయిన చెత్త కుప్పలు.. వీధుల్లో పారుతున్న మురుగు నీరు.. దోమల స్వైర విహారం.. వెరసి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంద రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసినా రామాయంపేట మున్సిపాలిటీలో పరిస్థితులు అధ్వానంగా మారాయి. నిధుల కొరతతో అధికారులు నామమాత్రంగా పనులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
– రామాయంపేట(మెదక్)
రామాయంపేట మేజర్ పంచాయతీ 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. పట్టణంలో సుమారుగా 25 వేల పైచిలుకు జనాభా ఉంటుంది. కాగా ప్రతి రోజు సుమారు ఏడు నుంచి ఎనిమిది మెట్రిక్ టన్నుల మేర చెత్త సేకరణ జరుగుతోంది. 37 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నా, పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు కొనసాగడంలేదు. పట్టణంలో సేకరించిన చెత్తను ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. ఆరుబయట పోస్తున్న చెత్తా చెదారంతో పరిసరాలు కలుషితమై మురుగుకూపంగా మారి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో పాటు పట్టణంలోని మురుగునీరు నేరుగా మల్లెచెరువులో కలుస్తుండటంతో చెరువులోని నీరు పూర్తిగా కలుషితమైంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా పారిశుద్ధ్యం విషయమై ఎలాంటి మార్పు లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీకాలనీ, గుల్పర్తి, కోమటిపల్లిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. ఐదో వార్డులో పెట్రోల్ బంక్ వెనుకభాగంలో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు నీటితో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. దోమల నివారణకు మురికి కాలువల్లో క్రిమి సంహారక మందు పిచికారీ, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు సక్రమంగా చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక పనులు కొనసాగుతున్నాయి
మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేస్తున్నాం. ఈమేరకు పట్టణం, శివారు గ్రామాల్లో పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మురుగు కాలువల్లో ఫాగింగ్, క్రిమి సంహారక మందు పిచికారీ చేయడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్