
కంకర పరిచి.. రోడ్డు మరిచి
నాలుగు జిల్లాలతో అనుసంధానమైన ప్రధాన రహదారి మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఏడాదిన్నరగా కంకర పరిచి వదిలేయడంతో రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
– రామాయంపేట/నిజాంపేట(మెదక్)
నిజాంపేట మండలం చల్మెడ కమాన్ నుంచి నందగోకుల్, నస్కల్ మీదుగా రాంపూర్, నిజాంపేట వరకు 18 కిలోమీటర్లు ఉంటుంది. గతంలో నిర్మించిన తారురోడ్డు పూర్తిగా శిథిలం కావడంతో కొత్త రోడ్డు నిర్మాణానికి గతంలో రూ. 12.20 కోట్లు మంజూరయ్యాయి. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డుపై కంకరపరిచి వదిలేశారు. దీంతో గత ఏడాదిన్నర కాలంగా కంకర రోడ్డుపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. పలువురు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. వాహనాలకు సైతం తరచూ రిపేర్లు రావడం నిత్యకృత్యంగా మారింది. ఈ రహదారి కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు అనుసంధానం కావడంతో జిల్లావాసులతో పాటు ఆయా జిల్లాలకు చెందిన ప్రయాణికులు తరచూ ప్రయాణిస్తుంటారు. నెలల తరబడి కంకర పరిచిన రోడ్డుపై ప్రయాణించడం కష్టసాధ్యం కావడంతో నస్కల్ గ్రామస్తులు తారు రోడ్డు పనులు ప్రారంభించాలని పలుమార్లు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చొరవ తీసుకొని సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు ప్రారంభించేలా చొరవ చూపారు. కాగా కాంట్రాక్టర్ నిజాంపేట నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల మేర.. నస్కల్ వరకు మాత్రమే తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వదిలేశాడు. నస్కల్ గ్రామస్తులకు ఊరట లభించినా, చల్మెడ, రాంపూర్, నందగోకుల్ గ్రామాల ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.
పనులు ప్రారంభించేలా చర్యలు
నిజాంపేట నుంచి రాంపూర్, నస్కల్, నందగోకుల్, చల్మెడ మీదుగా కమాన్ వరకు తారు రోడ్డు నిర్మాణానికి గతంలో రూ. 12.20 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ కంకర తొక్కించి పనులు ఆపివేయగా, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జోక్యం చేసుకోవడంతో నాలుగు కిలోమీటర్ల మేర పూర్తయింది. మిగితా పనిని త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
– సర్ధార్‌సింగ్, ఈఈ, రోడ్డు భవనాల శాఖ
అసంపూర్తిగా నాలుగు జిల్లాల అనుసంధాన రహదారి
18 కిలోమీటర్లకు కేవలం నాలుగు కిలోమీటర్లే పూర్తి
ఏడాదిన్నరగా వాహనదారుల అవస్థలు

కంకర పరిచి.. రోడ్డు మరిచి

కంకర పరిచి.. రోడ్డు మరిచి