
పాఠశాలకు డుమ్మా కొట్టొద్దు
కలెక్టర్ రాహుల్‌రాజ్
కొల్చారం(నర్సాపూర్): విద్యార్థుల బంగారు భవిష్యత్తు విద్యతోనే సాధ్యమని, పాఠశాలకు డుమ్మా కొట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని దేశ్యా తండా ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో హాజరు పట్టికను పరిశీలించారు. రెండు, మూడు రోజులుగా పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఉపాధ్యాయులతో ఆరా తీశారు. పాఠశాల కు రాని విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన కలెక్టర్ తల్లిదండ్రులతో చర్చించారు. విద్యార్థులను పాఠశాలకు పంపించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులను విద్యాశాఖ కల్పిస్తుందన్నారు. పిల్లలను ఇతర పనులకు తీసుకెళ్లకూడదన్నారు. ఉపాధ్యాయులు ఈ విషయంలో తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు చర్చించాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్‌ఎం ఏగొండ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.