
మహిళల భద్రతకు ‘భరోసా’
అదనపు ఎస్పీ మహేందర్
మెదక్ మున్సిపాలిటీ: మహిళల భద్రత కోసమే ప్రభుత్వం భరోసా సెంటర్లు ఏర్పాటు చేసిందని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ల ఏర్పాటు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ భరోసా కేంద్రం 2022 ఆగస్టు 7న ప్రారంభించినట్లు చెప్పారు. మహిళలు, పిల్లలపై జరిగే హింసకు వ్యతిరేకంగా సమగ్ర మద్దతు కల్పించే విధంగా భరోసా కేంద్రాలు చేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 250కి పైగా బాధితులను మానసిక, సామాజిక, చట్టపరమైన మద్దతుతో సహాయపడి వారికి ఆశ్రయం, పునరావాసం, న్యాయ సహాయం అందించినట్లు వెల్లడించారు. కేంద్రం ద్వారా ఇప్పటివరకు 150కి పైగా బాధితులకు సుమారు రూ. 67.74 లక్షల నష్ట పరిహారం అందించినట్లు వివరించారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు రక్షణ నిరంతరం కొనసాగిస్తామని అన్నారు.