
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
తూప్రాన్: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూన ఇళ్లను డీఆర్‌ఓ భూజంగరావు మంగళవారం ఆర్డీఓ జయచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి, ఎంపీడీఓ శేషాద్రిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను త్వరగా గుర్తించాలని సూచించారు. అనంతరం తూప్రాన్‌కు మంజూరు అయిన జూనియర్ సివిల్ కోర్టు భవనానికి అనువుగా ఉన్న మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంను ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోకి త్వరగా మార్చాలని సూచించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
‘పేట’లో పోలీసుల కవాతు
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో మంగళవారం రాత్రి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్), స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజల భద్రత కోసం తాము ఉన్నామని భరోసా కల్పించడానికే ఈ కవాతు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కవాతు కొనసాగింది. స్థానిక సీఐ వెంకట్ రాజాగౌడ్, ఆర్‌ఏఎఫ్ కమాండెంట్ విజయకుమార్ వర్మ ఆధ్వర్యంలో కవాతు జరిగింది.