
చిరుత దాడిలో దూడలు హతం
రామాయంపేట(మెదక్): మండలంలోని దంతేపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చిరుత దాడిలో రెండు దూడలు హతమయ్యాయి. గ్రామానికి చెందిన రైతు నక్కిర్తి స్వామి తన పశువులను రోజూ మాదిరిగానే వ్యవసాయ బావి వద్ద ఉంచగా, రాత్రి చిరుత దాడి చేసి హతమార్చింది. అక్కడికి సమీపంలో చిరుత పాద గుర్తులు గమనించిన రైతు శుక్రవారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు మృతిచెందిన దూడల కళేబరాలను పరిశీలించారు.
జాతీయ కబడ్డీ
క్యాంపునకు ఎంపిక
పాపన్నపేట(మెదక్): సబ్ జూనియర్ బాలికల, బాలుర విభాగంలో బాచుపల్లిలోని కాసాని జ్ఞానేశ్వర్ కబడ్డీ అకాడమీ క్యాంపునకు జిల్లా నుంచి ఇద్దరు ఎంపికయ్యారని శుక్ర వారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్‌రెడ్డి, సెక్రటరీ రమేష్ వెల్లడించారు. బాలికల విభాగంలో రాధిక, బాలుర వి భాగంలో నరేందర్ ఎంపికైనట్లు చెప్పారు. ఇటీవల వికారాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొని ప్రతిభ చూపారని తెలిపారు.
108 కిలోల గుండు
ఎత్తుకుని ప్రదక్షిణలు
నారాయణఖేడ్: ఖేడ్ మండలం తుర్కాపల్లిలో హోలీ పండుగ సందర్భంగా బండరాళ్ల గుండ్లు ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని గ్రామానికి చెందిన యువకుడు సాతిని జ్ఞానేశ్వర్ 108 కిలోల బరువున్న బండరాయి గుండును అవలీలగా ఎత్తుకుని గ్రామదేవత ఆలయం చుట్టూ అయిదు ప్రదక్షణలు చేసి ఔరా అనిపించాడు. గ్రామ పెద్దలు కరతాళధ్వనులతో అతడిని ఉత్సాహపరిచారు. అనంతరం రంగులు చల్లుకుంటూ హోలీ పండును నిర్వహించుకున్నారు.
గొడవపడి.. గొంతుకోసి
కౌడిపల్లి(నర్సాపూర్): కట్టుకున్న భార్యనే గొంతు కోసి కడతేర్చాలని చూశాడు ఓ భర్త. ఈసంఘటన మండల పరిధి తిమ్మాపూర్‌లో జరిగింది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన స్వాతిని బాలానగర్‌కు చెందిన రమేష్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే కొన్నేళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న రమేష్ నిత్యం గొడవపడేవాడు. అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దలు కల్పించుకొని నచ్చచెప్పారు. అయినా అతడిలో మార్పురాలేదు. ఈనెల 6వ తేదీన సైతం స్వాతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె తల్లిగారి ఊరు తిమ్మాపూర్‌కు వెళ్లింది. ఈక్రమంలో గురువారం సాయత్రం తిమ్మాపూర్ చేరుకున్న రమేష్ మాట్లాడేది ఉందని భార్యను గ్రామ శివారులోని హనుమాన్ ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ గొడవపడి తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో చేయి అడ్డుపెట్టడంతో స్వాతి తీవ్రంగా గాయపడింది. అరుపులకు చుట్టుపక్కల ఉన్న వారు రావడంతో రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గాయపడిన స్వాతిని చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చిరుత దాడిలో దూడలు హతం

చిరుత దాడిలో దూడలు హతం